బాబోయ్‌…ఇదేం సెటైర్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను సీబీఐ విచారించ‌డంపై సెటైర్స్ పేలుతున్నాయి. క‌విత నుంచి కేవ‌లం వివ‌ర‌ణ తీసుకోవ‌డానికి మాత్ర‌మే సీబీఐ వ‌చ్చిన‌ట్టు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు మించి…

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను సీబీఐ విచారించ‌డంపై సెటైర్స్ పేలుతున్నాయి. క‌విత నుంచి కేవ‌లం వివ‌ర‌ణ తీసుకోవ‌డానికి మాత్ర‌మే సీబీఐ వ‌చ్చిన‌ట్టు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు మించి క‌విత‌ను ఏమీ చేయ‌లేర‌ని తెలంగాణ అధికార పార్టీ నేత‌లు వెన‌కేసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అదిరిపోయే పంచ్ విసిరారు.

బిస్కెట్లు తిని, చాయ్ తాగ‌డానికి సీబీఐ అధికారులు క‌విత ఇంటికి వెళ్లారా? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. క‌విత ఏమైనా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలా? అని ఆయ‌న నిల‌దీశారు. సీబీఐ అధికారులు విచార‌ణ‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె ఇంటి వ‌ద్ద భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.

త‌ప్పు చేసిన వారు సిగ్గు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకుంటు న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌విత‌ను సింహం, పులి అంటూ కీర్తిస్తున్నారని, అంటే సీబీఐ అధికారుల‌ను ఏమైనా చేస్తామ‌ని పరోక్షంగా బెదిరిస్తున్నారా? అని ఆయ‌న మండిప‌డ్డారు.

జాతీయ పార్టీగా బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా విస్త‌రించ‌క ముందే, అవినీతిని వ్యాపింప‌జేశార‌ని బండి సంజ‌య్ దెప్పి పొడిచారు. ఏ ఆధారాలు లేకుండానే క‌విత‌ను సీబీఐ విచారిస్తుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అవినీతికి పాల్ప‌డిన ప్ర‌తి ఒక్క బీఆర్ఎస్ నేత జైలుకెళ్లాల్సిందే అన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత అడ్డంగా దొరికిపోయార‌ని ఆయ‌న అన్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు చిదంబ‌రం జైలుకెళ్లిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.