ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్వాన స్థితిలో ఉందన్న సంగతి తెలిసిందే కదా. తెలంగాణలో పార్టీ అంతో ఇంతో యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఆంధ్రాలో అసలు పార్టీ ఉందా అనే అనుమానం కలుగుతోంది.
తెలంగాణలో అధికార పార్టీపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తోంది. నిరంతరం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది. పార్టీ నుంచిచాలామంది నాయకులు వెళ్ళిపోయినా, ఇంకా వెళ్లిపోతూనే ఉన్నా పార్టీ మాత్రం ముక్కుతూ మూలుగుతూ మనుగడ సాగిస్తూనే ఉంది. తన ఉనికిని కాపాడుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం పూర్తిగా చతికిలపడింది.
కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ ఏమిటో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి చురుగ్గా పని చేస్తుండగా ఆంధ్రాలో అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరా రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించారు. ఆ తరువాత సాకే శైలజానాథ్ చురుగ్గా పనిచేసిన దాఖలాలు లేవు. ఆయన్నిఉన్నట్లుండి రుద్రరాజును అధ్యక్షుడిని చేశారు. ఆయన ఈమధ్యనే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన పనితీరు గురించి ఇప్పుడే మాట్లాడలేం.
కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత వైఎస్సార్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు మాత్రం ఏపీ కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందన్నారు. భవిష్యత్తు ఉందంటే అర్ధం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడమన్న మాట.
ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే 2024 లో కాకపోయినా..2029 నాటికికైనా కాంగ్రెస్ తన సత్తా చాటుతుందని కేవీపీ చెప్పుకొచ్చారు. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, తనకు కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ఇచ్చిందని కేవీపీ గుర్తు చేసారు. 1978 నుంచి అనేక పదవులు కట్టబెట్టిందని చెప్పుకొచ్చారు. అలాంటి పార్టీని వీడకూడదని, ఏనాడూ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించకూడదనేది తమ విధానంగా ఉండేదన్నారు. పార్టీ అధినాయకత్వాన్ని పల్లెత్తుమాట అనకూడదని 1996లోనే రాజశేఖర్‌రెడ్డి, తానూ ఒట్టేసుకున్నామని కేవీపీ చెప్పారు. తాను చివరిదాకా కాంగ్రెస్ తోనే ఉంటానని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేసారు.
ఇక, కొత్తగా ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన గిడుగు రుద్రరాజు రాష్ట్రంలో పాదయాత్రకు సిద్దం అవుతున్నారు.
ఏపీకి పీసీసీ చీఫ్..కొత్త కమిటీలను ఏర్పాటు చేసిన ఏఐసీసీ కేవీపీకి కీలక బాధ్యతలు అప్పగించింది. మరి కేవీపీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతవరకు కృషి చేస్తారో చూడాలి.