మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తున్నారు. తెలంగాణ కేసీఆర్‌కు దేశంలోనే డర్టీయిస్ట్ పొలిటీషియన్‌గా బాబు కనిపిస్తారు. టీడీపీ శ్రేణులకి మాత్రం బాబు గొప్ప విజనరీగా కనిపిస్తారు. బాబుపై పవన్ మనసులో మాట ఏంటో తెలియదు. బహుశా బాబుపై పవన్‌ది మూగ ప్రేమ కాబోలు. మోదీకి, అమిత్‌షాకు చంద్రబాబు అంటే కోపం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నమ్మదగ్గ రాజకీయ నాయకుడు కాదనేది మెజార్టీ రాజకీయ నేతల అభిప్రాయం.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాస్త ముందుకెళ్లి బాబుపై ఘాటు వ్యాఖ్య చేశారు. అసలు రాజకీయ నేత ఎలా వుండకూడదో చంద్రబాబును ఉదాహరణగా ఆయన చూపడం గమనార్హం. తనది 40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్ అని చంద్రబాబు గొప్పగా చెబుతుంటే, సజ్జల మాత్రం అసలు ఆయన రాజకీయాలకే అనర్హుడని ఛీత్కరించారు. ప్రస్తుతం దిగజారిన రాజకీయ వ్యవస్థలో విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
రాజకీయాల్లో విలువలకు చాప చుట్టేసి ఏ చెట్టుపైన్నో పెట్టారు. అడ్డదిడ్డంగా, ఏ మాత్రం నిజాలతో సంబంధం లేకుండా పచ్చి అబద్ధాల్ని కళ్లార్పకుండా మాట్లాడే వాళ్లే ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా రాజకీయ నేత ఎలా వుండకూడదో చెప్పేందుకు చంద్రబాబును సజ్జల ఉదాహరణగా చూపడం కాస్త అతిశయోక్తే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవాళ సజ్జల మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇదేం ఖర్మ అని అనుకోవడం వల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని విమర్శించారు. ఏపీలో 90 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్ మంచి పాలనకు ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. అయితే తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.