వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మరోసారి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన గతంలో చూసిన వాణిజ్య వ్యవహారాల స్టాండింగ్ కమిటీకే ఈసారి కూడా నాయకత్వం వహిస్తారు.
కరోనా టైమ్ లో కూడా ఎక్కువగా సమావేశాలు నిర్వహించి మంచి అవుట్ పుట్ రాబట్టిన స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయసాయిరెడ్డికి ఇప్పటికే అభినందనలు లభించాయి.
దాంతో మారో మారు ఆయనను ఈ ఉన్నతమైన పదవి వరించింది అనుకోవాలి. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి ఈ పదవి లభించడం పట్ల విశాఖ వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు ఢిల్లీలో, ఇటు ఉత్తరాంధ్రాలో కూడా ఆయన విజయపధాన సాగుతున్నారని కొనియాడుతున్నారు.
విజయసాయిరెడ్డి కార్యదీక్ష, ఆయన దక్షతలకే ఈ గౌరవం అని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మీద టీడీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. మరీ ముఖ్యంగా అనేక కేంద్ర కమిటీలలో ఆయనకు చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదనే అంటున్నారు.