ఆ నవరత్నాలూ నావే.. బాబుకి అదో తుత్తి

స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారులను ప్రజా సమస్యలకు జవాబుదారీగా మారిస్తే.. అది మా గ్రీవెన్స్ డే కార్యక్రమానికి కాపీ అన్నారు చంద్రబాబు. గ్రామ సచివాలయాలతో లక్షలమందికి ఉద్యోగాలిస్తే.. ఈ సచివాలయాలు మేమెప్పుడో పెట్టాం,…

స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారులను ప్రజా సమస్యలకు జవాబుదారీగా మారిస్తే.. అది మా గ్రీవెన్స్ డే కార్యక్రమానికి కాపీ అన్నారు చంద్రబాబు. గ్రామ సచివాలయాలతో లక్షలమందికి ఉద్యోగాలిస్తే.. ఈ సచివాలయాలు మేమెప్పుడో పెట్టాం, రంగులు మారుస్తున్నారు అంతే కదా అని నిట్టూర్చారు. రైతు భరోసా ప్రకటిస్తే.. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కొత్తపథకం తెచ్చారని, అది కూడా కాపీయేనంటూ విమర్శించారు. ఇప్పుడు వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం ద్వారా కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని కూడా కాపీయేనంటున్నారు బాబు.

అప్పుడెప్పుడో తమ జమానాలో ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రాలు అనే పేరుతో తాము కంటి వైద్యం కార్యక్రమాన్ని చేపట్టామని, దాన్ని పేరుమార్చి జగన్ వైఎస్సార్ కంటివెలుగు అనే కార్యక్రమం మొదలుపెట్టారంటూ కొత్త పల్లవి అందుకున్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఐ కేంద్రాల్లో ఆరున్నర లక్షలమందికి పరీక్షలు చేసి, సుమారు నాలుగున్నర లక్షల మందికి కళ్లజోళ్లు అందించామని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది నిజమేనా?

చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరిగిందనీ, నాలుగున్నర లక్షలమంది లబ్ధిపొందారని ఆ పార్టీ నాయకులకే చాలామందికి తెలియదు. పేరు బైటకు రాకుండా ఇలాంటి పథకాలతో కోట్ల రూపాయలు బొక్కేసిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు వైఎస్సార్ కంటివెలుగు అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే సరికి ఉడుక్కుంటున్నారు. సెల్ ఫోన్ నేనే కనిబెట్టాను, తుఫాన్లు నేనే కట్టడి చేశాను అనే టైపులో.. కంటివెలుగు కార్యక్రమం కూడా నాదే అంటున్నారు.

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 5కోట్ల 40లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. తొలిదశలో 70లక్షలమంది విద్యార్థులకు వాళ్లు ప్రభుత్వ స్కూల్ లో ఉన్నా, ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నా.. అందరి దగ్గరకు ప్రభుత్వ సిబ్బంది వెళ్లి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లజోళ్లను ఉచితంగానే అందిస్తారు, ఇంకా అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేస్తారు. అవి కూడా ఉచితంగానే చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది.

ఈరోజునుంచి లాంఛనంగా మొదలయ్యే వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రంలో మరో సంచలనంగా మారబోతోంది. ప్రజల్లో జగన్ ఇమేజ్ ని మరింత పెంచబోతోంది. చంద్రబాబు వైఖరి చూస్తుంటే.. నవరత్నాలు కూడా నా ఆలోచనే, అది కూడా జగన్ కాపీ కొట్టారని వాదనకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రబాబు నోట ఆ మాట కూడా త్వరలోనే వింటామేమో.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!