తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది ఊహించని పరిణామమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు ప్రముఖంగా వినిపించడాన్ని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసులో కవిత పేరు బయటికి రావడంతో సీబీఐ నోటీసులు ఇచ్చింది.
కవిత ఇంట్లోనే ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ అధికారుల బృందం హైదరాబాద్ వచ్చింది. రెండు వాహనాల్లో కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. మొత్తం 11 మందిలో మహిళా అధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. కవిత న్యాయవాది సమక్షంలో ఆమెను విచారిస్తున్నారని వార్తలొస్తున్నాయి. సీబీఐ విచారణ నేపథ్యంలో తెలంగాణలో ఉత్కంఠ నెలకుంది.
సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలోని విచారణ టీం దగ్గర ఆధారాలేంటి? వాటికి కవిత ఇచ్చే సమాధానాలు తదితర అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కవితను ఎన్ని గంటలు విచారిస్తారు? ఈ ఒక్కరోజుతో విచారణ ముగుస్తుందా? లేక మున్ముందు కూడా వుంటుందా? అనే అంశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీబీఐ అధికారులకు కవిత సహకరిస్తారా? వారు అడిగిన, కోరుకున్న వాటికి కవిత నుంచి సరైన సమాధానాలు వస్తాయా? రాకపోతే పర్యవసానాలు ఏంటి? ….ఇలా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటి అన్నింటికి కాలమే జవాబు చెప్పాల్సి వుంది.