పలు సంచలన ఫలితాలతో సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో అతి పెద్ద సంచలనంగా నిలుస్తోంది క్వార్టర్ ఫైనల్స్ లో మొరాకో జట్టు ప్రదర్శన. ఫిఫా వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్స్ లో ఒకటైన పోర్చుగల్ జట్టును క్వార్టర్స్ నుంచి ఇంటికి పంపించింది మొరాకో. 1-0 గోల్స్ తో తేడాతో విజయం సాధించి మొరాకో సెమిస్ బెర్త్ ను పొందింది. ఈ విజయానికి సంబంధించి అతి పెద్ద విశేషం ఏమిటంటే.. ఫిఫా ప్రపంచకప్ సెమిస్ కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టు మొరాకో!
ఇప్పటి వరకూ ఏ ఆఫ్రికన్ జట్టు కూడా సాకర్ ప్రపంచకప్ లో సెమిస్ వరకూ చేరలేదు! 2010లో సౌతాఫ్రికా ఫిఫా ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చి సాకర్ విషయంలో పెద్ద ఫీట్ నమోదు చేయగా, ఇన్నేళ్లకు ఒక ఆఫ్రికన్ జట్టు సెమిస్ కు చేరగలిగింది. అది కూడా పోర్చుగల్ ను ఓడించి!
అంతకు ముందు మ్యాచ్ లో పోర్చుగల్ మంచి ఊపు మీద కనిపించింది. ఆ జట్టు ప్రఖ్యాత ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను బెంచ్ కు పరిమితం చేసి మరీ పోర్చుగల్ సాధించిన విజయంతో ఆ జట్టు తన సత్తాను చూపించింది. అలా మంచి ఫామ్ లో ఉన్న టీమ్ ను మొరాకో ఓడించింది.
ఇక అర్జెంటీనా, ఫ్రాన్స్, క్రొయేషియా లు సెమిస్ లోని మిగతా బెర్త్ లను ఆక్రమించాయి. బ్రెజిల్ కనీసం సెమిస్ వరకూ చేరలేకపోవడం మరో విశేషం. గత ప్రపంచకప్ ఫైనలో తలపడిన ఫ్రాన్స్, క్రొయేషియాలు ఈ సారి కూడా సెమిస్ కు చేరాయి. గత ఫైనల్ లో క్రొయేషియాను ఓడించి ఫ్రాన్స్ ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ సారి అర్జెంటీనా- క్రొయేషియాలు ఒక సెమిస్ లో తలపడనుండగా, ఫ్రాన్స్- మొరాకోలు మరో సెమిస్ లో తలపడనున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఫ్రాన్స్ కు మొరాకో తన సత్తా చూపిస్తుందా, లేక ఫ్రాన్స్ మరోసారి ఫైనల్ కు రీచ్ అవుతుందా అనేది ఒక కొశ్చన్ మార్క్. మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా వర్సెస్ బుల్లి దేశం క్రొయేషియాల్లో ఎవ్వరు ఫైనల్ కు చేరబోతున్నారనేది మరో ఆసక్తిదాయకమైన ఫలితం.