జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన పెద్ద లాబీయిస్టు అయినా తెలుగు వాళ్లకు మాత్రం నటి జయప్రద సన్నిహితుడిగా పరిచయస్తుడు. యూపీ సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు ఒక సమయంలో. ఆ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ హయాంలో ఆయన తర్వాత ఈయనే అనే పరిస్థితి ఉండేది. అలాగే అణుఒప్పందం సమయంలో యూపీఏ-1 ప్రభుత్వ మనుగడ కష్టాల్లో పడగా చక్రం అడ్డేసిన వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అమర్ సింగ్. అప్పటి వరకూ కాంగ్రెస్- సమాజ్ వాదీ పార్టీల మధ్యన పచ్చగడ్డేసినా భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఆ తర్వాతి కాలంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ పొత్తుతో వెళ్లేంత సాన్నిహిత్యం పెరిగింది. దానికంతా అమర్ సింగ్ వేసిన పునాదులే కారణం.
అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినిమా వాళ్లలోనూ విపరీత స్థాయి క్రేజ్ ఉండేది ఒకానొక సమయంలో అమర్ సింగ్ కు. ఢిల్లీలో, ముంబైలో ఆయనకు చాలా మంది సన్నిహితుడు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అమర్ పక్కన పోజులిచ్చేవారు. అమితాబ్, సంజయ్ దత్ ఇలాంటి వాళ్లంతా అమర్ సింగ్ కు సన్నిహితులే. తెలుగు నుంచి హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా, రాజకీయ నేతగా ఎదిగిన జయప్రదకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు అమర్ సింగ్.
పార్లమెంట్ సమావేశాల వేళ కూడా వీళ్లు జంటగా కనిపిస్తూ అనునిత్యం వార్తల్లో ఉండేవారు. వీరి టెలిఫోన్ సంభాషణ ఒకటి అప్పట్లో సంచలనంగా నిలిచింది. అమర్ సింగ్ తో పాటు జయప్రద కూడా సమాజ్ వాదీ పార్టీకి దూరం అయ్యారు. వీరిద్దరూ బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినట్టుగా ఉన్నారు. అది చిత్తైంది. ఆ తర్వాత జయప్రద బీజేపీలో చేరారు. అమర్ మాత్రం ఆనారోగ్య కారణాలతో లాబీయింగ్ లన్నింటికీ దూరం అయినట్టుగా ఉన్నారు. అయితే ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు.
64 ఏళ్ల అమర్ సింగ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారట. కొన్నేళ్ల కిందటే ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. శనివారం ఉదయం కూడా ఆయన ట్వీటర్లో పోస్టులు పెట్టినట్టున్నారు. బాలగంగాధర తిలక్ గురించి, కరోనాను ఎదుర్కొనడం గురించి ట్వీట్ చేసిన ఆయన మరణించినట్టుగా శనివారం సాయంత్రం వార్తలు వస్తున్నాయి. గతంలోనూ ఆయన మరణించాడని కొన్ని పుకార్లు షికారు చేశాయి. అయితే టైగర్ జిందాహై అంటూ ఆయన ట్వీట్ చేశారప్పట్లో.