మూడు రాజధానుల బిల్లులపై శుక్రవారం గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే….టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డ్రామాకు తెరలేపారు. మూడు రాజధానుల అంశంపై వైసీపీ సర్కార్ తిరిగి ఎన్నికలకు వెళ్లాలని లేదా రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో బాబుకు రియాక్షన్ ఎదురైంది.
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని మంత్రులు కొడాలి నాని, అప్పలరాజు, ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ఎన్నికల సవాల్‌పై చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ఇతర నాయకుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.
వేర్వేరు ప్రాంతాల్లో మీడియాతో వైసీపీ మంత్రులు , ఎమ్మెల్యే మాట్లాడారు. మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఒక వేళ ఉపఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు.
రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉంటే చంద్రబాబు, బాలయ్యలను మాత్రమే గెలిపించారని కొడాలి నాని అన్నారు. సీమ ప్రజలు చీదరించుకున్నా బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఉత్తరాంధ్ర అంటే కంచుకోట అని, చివరికి అక్కడ ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్నారు. కృష్ణా, గుంటూరు ప్రజలు బాబు మోసాన్ని గ్రహించి లోకేశ్‌ను ఓడించారన్నారు.
మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలంతా అమరావతి కోరుకుంటున్నారని చంద్రబాబు నమ్మితే.. తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ బాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అమరావతి రైతులకు తమ ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదన్నారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో మూడు ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.