రవి ప్రకాష్ ను అరెస్టు చేస్తే… ప్రముఖులు ఎవ్వరూ పరామర్శించలేదు! ఐదారు నెలల కిందటి వరకూ ఆంధ్రా నుంచి అమెరికా వరకూ రవి ప్రకాష్ పేరు మార్మోగేది. ఇప్పుడు కేరాఫ్ చంచల్ గూడ జైలు. ఎంతోమంది రాజకీయ నేతలను ఇంటరాగేట్ చేసిన రవి ప్రకాష్ ను తమ ఇంటరాగేషన్ కు అప్పగించాలని పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న రవి ప్రకాష్ ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. ఆ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది.
కొన్ని కోట్ల రూపాయలను గల్లంతు చేసిన వ్యవహారంలో రవి ప్రకాష్ అరెస్ట్ అయ్యారు. టీవీ నైన్ సీఈవో హోదాలో ఉన్నప్పుడు ఈయన మోసానికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయ్యారు. ఆ సంగతలా ఉంటే..చంచల్ గూడ జైల్లో ఉన్న రవి ప్రకాష్ కు మద్దతుగా ఎవరూ ఎలుగెత్తడం లేదు!
ఆఖరికి సొంత సామాజికవర్గం ప్రముఖులు, సొంత సామాజికవర్గం మీడియా వాళ్లు కూడా రవి ప్రకాష్ ను ఇప్పుడు పట్టించుకోవడం లేదు. బయట ఉన్నప్పుడు తమ వాడే కానీ, ఇప్పుడు కాదన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే రవి ప్రకాష్ ను పరామర్శించిన ఏకైక ప్రముఖుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి! రవి ప్రకాష్ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం పని చేసిన వ్యక్తి ఏమీ కాదు. అయినా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు పరామర్శించేశారు.
అయితే ఈ పరామర్శ వెనుక కొంత గూడుపుఠానీ ఉందనే టాక్ వినిపిస్తూ ఉంది. వీరిద్దరి మధ్యన కొన్ని సంబంధాలున్నాయని, అవి ఆర్థిక పరమైనవి కూడా అని అంటున్నారు. మరి కొందరేమో రేవంత్ రెడ్డి జుట్టు రవి ప్రకాష్ చేతిలో ఉందని కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రవి ప్రకాష్ ను పరామర్శించాకా రేవంత్ రెడ్డి కూడా ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ సర్కారును ఈ విషయంలో విమర్శించలేదు. పరిశీలకులు మాత్రం ఈ బంధాన్ని భూతద్దాలతో చూస్తూ ఉన్నారు. ఆఫ్ ద రికార్డుగా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.