'నేచురలీ కరప్టెడ్ పార్టీ..'ఇదీ ఎన్సీపీకి గతంలో మోడీ ఇచ్చిన బిరుదు. తను తొలిసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు ఎన్సీపీ పై బోలెడన్ని విమర్శలు చేశారు మోడీ. అందులో భాగంగా ఆ పార్టీని అవినీతిమయమైన పార్టీ అంటూ విమర్శించారు. ఎన్సీపీకి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. సహజమైన అవినీతిమయ పార్టీ అంటూ దుమ్మెత్తిపోశారు!
కట్ చేస్తే మోడీ ప్రధాని అయ్యారు. మహారాష్ట్రలో ఎన్సీపీ చిత్తు అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యున్నత పురస్కారాల్లో రెండో స్థాయి దాన్ని ప్రకటించింది మోడీ సర్కారు. భారతరత్న తర్వాత ఉత్తమ పౌర సత్కారం అయిన 'పద్మవిభూషన్' అవార్డును శరద్ పవార్ కు ప్రకటించింది బీజేపీ సర్కారు. అప్పుడే చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మొన్నటి వరకూ 'నేచురలీ కరప్టెడ్' అంటూ ఎవరిని అన్నారో.. వారికే మోడీ ప్రభుత్వం ఉత్తమ పౌర సత్కారాన్ని అందించింది. గొప్పగా గౌరవించింది. అదీ మోడీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అయ్యింది.
ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మోడీగారు శరద్ పవార్ ను విమర్శించడం మొదలుపెట్టారు. పవార్ దేశ ద్రోహి అనేంత స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. పవార్ పాకిస్తాన్ అనుకూలుడంటూ తేల్చారు మోడీ. ఈ సమయంలో సరైన కౌంటరే ఇచ్చారు ఎన్సీపీ అధినేత.
'ఈ పాకిస్తానీ అనుకూలుడుకే మోడీ ప్రభుత్వం పద్మవిభూషన్ అవార్డును ఇచ్చింది..' అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. తనను దేశద్రోహి అన్నట్టుగా మోడీ అభివర్ణించడం పట్ల పవార్ ఫైర్ అయ్యారు. తనను ఇప్పుడు ఇంతలా విమర్శిస్తున్న మోడీ ప్రభుత్వమే ఎందుకు దేశ అత్యున్నత పురస్కారాల్లో ర్యాంక్ టు అవార్డును తనకు ఇచ్చిందని పవార్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి కమలనాథులు సమాధానం చెప్పగలరా.. 'చక్కెర కర్మాగారాల లాబీయింగ్ కు మోడీ సర్కారు తలొంచి.. ఆ అవార్డును పవార్ కు ఇచ్చింది..' అనే అప్పుడు వినిపించిన ప్రచారాన్ని కమలనాథులు విడమరిచి చెప్పగలరా!