మారథాన్ అంటేనే చాలా కష్టంతో కూడిన పని. ఎంతో ప్రాక్టీస్ అవసరం. అలాంటిది ప్రతిరోజూ మారథాన్ అంటే ఊహించడానికే కష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా పూర్తిచేసింది ఆస్ట్రేలియన్ మహిళ. వరుసగా 107 రోజుల పాటు మారథాన్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.
ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల ముర్రే బార్ట్ లెట్ ఈ ఘనత సాధించింది. క్వీన్ లాండ్ లోని కేప్ యార్క్ లో ప్రతి రోజూ 42.2 కిలోమీటర్లు మారథాన్ చేసేది బార్ట్ లెట్. అలా ఆగస్ట్ లో ఈ ఛాలెంజ్ మొదలుపెట్టింది. ప్రతి రోజూ ఇలా మారథాన్ చేస్తూ, డిసెంబర్ 3 నాటికి 107 రోజులు పూర్తి చేసింది.
గతంలో కేట్ జేడెన్ అనే బ్రిటిష్ మహిళ, వరుసగా 106 రోజుల పాటు మారథాన్ చేసి స్థాపించిన రికార్డును, ఆస్ట్రేలియాకు చెందిన బార్ట్ లెట్ అధిగమించింది. అయితే తన మారథాన్ ను 107 రోజులతో ఆపనంటోంది ఈమె. 150 రోజుల పాటు మారథాన్ పూర్తిచేస్తానని చెబుతోంది.
వన్యప్రాణుల్ని సంరక్షించాలనే లక్ష్యంతో ఈమె ఈ మారథాన్ ను ప్రారంభించింది. దీంతో పాటు ఫిట్ నెస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మారథాన్ లో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినట్టు చెప్పింది బార్ట్ లెట్.