వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఆమె పరామర్శ ఎంతో ప్రత్యేకం. షర్మిలను పరామర్శించిన ఆ ప్రత్యేక వ్యక్తి మరెవరో కాదు… మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత. వైఎస్ సిస్టర్స్ ఇద్దరి కలయికపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. పాదయా త్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అన్యాయంగా అరెస్ట్ చేసిన తన వాళ్లను విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో షర్మిల పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే.
రెండు రోజులుగా ఆమె ఆమరణ దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలొచ్చాయి. దీంతో ఆమెను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు షర్మిలను డాక్టర్ సునీత పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
తన తండ్రి వివేకా హత్యపై సోదరుడైన వైఎస్ జగన్ పాలనలో న్యాయం జరగలేదనే ఆవేదన డాక్టర్ సునీతలో వుంది. దీంతో సీబీఐ విచారణను మరో రాష్ట్రానికి మార్చాలంటూ ఆమె న్యాయ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. సునీత పోరాట ఫలితంగా ఆంధ్రా నుంచి తెలంగాణకు సీబీఐ విచారణ మారిన సంగతి తెలిసిందే. డాక్టర్ సునీత, ఆమె భర్తకు వ్యతిరేకంగా ఏపీ అధికార పార్టీ నేతలు ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే జగన్ సొంత పత్రిక ఆమెకు వ్యతిరేకంగా కథనాలు వండుతోంది.
జగన్, సునీత మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్న పరిస్థితి. మరోవైపు డాక్టర్ సునీతకు షర్మిల మద్దతు వుందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ… షర్మిలను డాక్టర్ సునీత పరామర్శించడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. అన్నతో షర్మిల, సునీత విభేదిస్తున్నారని, వాళ్లద్దరి ఆలోచనలు ఒకటే అనే చర్చకు తెరలేచింది. పరామర్శ వరకే సునీత పరిమితం అవుతారా? లేక రాజకీయంగా అండగా వుంటారా? అనేది తేలాల్సి వుంది.