తెలంగాణలో మరో ‘సకల జనుల సమ్మె’.?

సకల జనుల సమ్మె.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించింది. మొత్తంగా తెలంగాణ ప్రజానీకమంతా ఈ సమ్మెలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్నీ ఈ సకల జనుల సమ్మె…

సకల జనుల సమ్మె.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించింది. మొత్తంగా తెలంగాణ ప్రజానీకమంతా ఈ సమ్మెలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల్నీ ఈ సకల జనుల సమ్మె ఏకం చేసింది. సకల జనుల సమ్మె ఎంత ఉధృతంగా అప్పట్లో సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక, ఇప్పుడు సకల జనుల సమ్మెకి సీక్వెల్‌ సిద్ధమవుతోంది. రేపో మాపో ప్రకటన కూడా రాబోతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా, సీమాంధ్రుల సమైక్య నినాదానికి వ్యతిరేకంగా అప్పట్లో సకల జనుల సమ్మె జరిగితే, ఇప్పుడు తెలంగాణలో.. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనుల సమ్మె జరగబోతోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మీద కేసీఆర్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపిన విషయం విదితమే.

ఆర్టీసీ అన్నాక ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు వుంచడం అనేది ఎన్నో ఏళ్ళు జరుగుతున్న వ్యవహారమే. ఆర్టీసీ లాభ నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత.. అంటాయి కార్మిక సంఘాలు. గతంలో, ఆర్టీసీ డిమాండ్లు న్యాయబద్ధమైనవని నినదించిన కేసీఆర్‌, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్ని అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే కొనసాగిస్తున్న సమ్మెని, మరింత ఉధృతం చేయాలనుకుంటున్నారు.

ఒక్క ఆర్టీసీ కార్మికులే కాదు, టీచర్లు సహా ప్రభుత్వం తీరు పట్ల సంతృప్తిగా లేని వివిధ సంఘాల్ని వెంటేసుకుని.. సకల జనుల సమ్మె చేపట్టే దిశగా రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, సకల జనుల సమ్మె వెనకాల అప్పట్లో కేసీఆర్‌ వున్నారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లో, కోదండరామ్‌ నేతృత్వంలో సకల జనుల సమ్మె అప్పట్లో ఉధృతంగా నడిచింది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు.

తెలంగాణలో కేసీఆర్‌ ఏం చెబితే అదే చెల్లుబాటయ్యే పరిస్థితి వుందిప్పుడు. కేసీఆర్‌ ఎవర్నయినా పొగిడితే, అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకోవాలి. కేసీఆర్‌ ఎవర్నన్నా తిడితే.. అందరూ ఆ వ్యక్తిని ఆడిపోసుకోవాలి.. ఈ రూల్‌ ఇప్పుడే కాదు, గడచిన కొన్నేళ్ళుగా తెలంగాణలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో సకల జనుల సమ్మె.. అంటూ ఆర్టీసీ కార్మికులు కావొచ్చు, మరొకరు కావొచ్చు.. ఎంత యాగీ చేసినా ఉపయోగం శూన్యమే కావొచ్చు.