అధికారం తలకెక్కడం.. అనేది ఏ పార్టీలో అయినా సర్వసాధారణమే. దాన్ని వీలైనంత త్వరగా పార్టీ అధినేత తగ్గించగలిగితే, అది పార్టీకైనా.. ప్రభుత్వానికైనా మేలు చేస్తుంది. నెల్లూరు జిల్లాకి సంబంధించి ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కాస్తా వైసీపీని వివాదాల్లోకి నెట్టింది. తొలుత సీనియర్ జర్నలిస్ట్ డోలేంద్రప్రసాద్‌పై దాడి, ఆ తర్వాత మహిళా ఎంపీడీవోపై యాగీ.. వెరసి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డితో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధిపత్య పోరు.. నెల్లూరు రాజకీయాల్ని మరింత హీటెక్కించేసింది.
విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శల సంగతెలా వున్నా, పార్టీ పరువు.. ప్రభుత్వం పరువు పోయేలా వుందన్న కోణంలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఇద్దరినీ పిలిచి క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. 'అబ్బే, ఆ గొడవల విషయంలో కాదు.. త్వరలో నెల్లూరులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్ల కోసమే అమరావతికి వచ్చాం.. అంతా హ్యాపీ.. మా మధ్య వివాదాలేమీ లేవు..' అని ఇటు కోటంరెడ్డి, అటు కాకాని తేల్చి చెప్పేశారు. తామిద్దరం బంధువులమేననీ, చిన్నప్పటినుంచీ స్నేహితులమనీ చెప్పుకున్నారు.
మొత్తమ్మీద, కాకాని గోవర్ధన్‌రెడ్డి – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య వివాదం సద్దుమణగడంతో స్థానిక నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 'నా మీద పెట్టిన కేసుల్లో పస లేదు. అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారనే నా ఆరోపణకు కట్టుబడి వున్నా..' అంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే వున్నారనుకోండి.. అది వేరే విషయం.
ఏదిఏమైనా, నాలుగు నెలల కాలంలో.. పరిపాలనకు సంబంధించి ఒక్కో విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి, ఇలాంటి ఇబ్బందుల్ని కింది స్థాయి నేతలు అస్సలేమాత్రం కల్పించకూడదు. లేదూ, టీడీపీ తరహాలోనే ఆధిపత్య పోరు కొనసాగిస్తామంటే.. వైఎస్ జగన్ దగ్గర ఆ పప్పులుడికే పరిస్థితి వుండదన్నది నిర్వివాదాంశం.