ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రజల ఆకాంక్ష మేరకు పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రజల నుంచి పుట్టుకు రాకపోయినా, ప్రజా ఉద్యమం ద్వారా నడిచిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీని ప్రజలే బతికించారు. ఉద్యమమే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది. అయితే ఉద్యమం పార్టీల తీరులా లేదరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తీరు!
తమిళనాట రెండు ప్రధాన పార్టీలున్నాయి. వాటిల్లో ఒకటి ఉద్యమ పార్టీ. రెండోది అభిమానంతో ఎదిగిన పార్టీ. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డీఎంకే. అభిమానాన్నే సంపదగా మార్చుకున్న పార్టీ అన్నాడీఎంకే. ద్రవిడ ఉద్యమం నుంచి డీఎంకే పుట్టుకొచ్చింది. ఎంజీఆర్, జయలలితలపై ఉన్న అభిమానమే అన్నాడీఎంకేను ప్రత్యామ్నాయంగా నిలిపింది. అందుకే అన్నాడీఎంకే అధికారంలో ఉండే సమయంలో తీవ్రమైన నిర్ణయాలుంటాయి!
మంత్రులతో, అధికారులతో, వ్యవస్థతో ఆఖరికి ప్రజలతో కూడా అన్నాడీఎంకే వివిధ సమయాల్లో తీవ్రంగా వ్యవహరించింది. నియంతృత్వ పోకడలు ఉంటాయి జయలలిత హయాంలో. కాళ్ల మీద పడటాలు, సాగిలాపడటాలు అభిమానధనులతో ఎదిగిన పార్టీలో ఉంటాయి. అదే ఉద్యమ పార్టీలో అలాంటివి ఉండవు. అయితే డీఎంకే కూడా క్రమక్రమంగా ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా మారిందనుకోండి.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి గత దశాబ్దకాలంలో ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన పార్టీ. పదిసీట్లకు పరిమితం అయిన పార్టీ ప్రజా ఉద్యమంతో, రాజకీయ శూన్యతలో ఎదిగి వచ్చింది. కొత్త రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అలా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ హయాంలో సమ్మెలు రావడం ఒక విచిత్రం అయితే, ఆ సమ్మెను తీవ్రంగా అణిచి వేస్తూ ఉన్నారు కేసీఆర్.
ఉదాహరణకు.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెల చేశారు. కొన్నినెలల పాటు అప్పుడు విధులకు దూరం అయ్యి వాళ్లుకూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటారు. అప్పుడు కూడా నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఇంత కర్కశమైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు.
అప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటే..కేసీఆర్ పరిస్థితి ఏమయ్యేదో! అణిచి వేయాలని అప్పుడు ఉద్యమం పట్ల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటే.. ప్రత్యేక రాష్ట్రమూ ఏర్పడేది కాదు, కేసీఆర్ కు సీఎం సీటూ దక్కేది కాదేమో. ఎవరి ఉద్యమాల ద్వారా అయితే కేసీఆర్ ఆకాంక్షలు నెరవేరాయో… అలాంటి వారి సమ్మెలను ఇప్పుడు కేసీఆర్ సమ్మెటతో మోదుతుండటం విడ్డూరం. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కేసీఆర్ సారూ! అని పరిశీలకులు అంటున్నారు.