ఇప్పటికే కొన్ని రోజులుగా పోలిస్ కస్టడీలో ఉన్నారు తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్. తన పొలిటికల్ కెరీర్ లో చింతమనేని యాభైకి పైగా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారని సమాచారం. ఇన్నేళ్లూ అవి విచారణలోనే కొనసాగుతూ ఉన్నాయి. అయితే చింతమనేని అరెస్టు మాత్రం జరగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇటీవల అధికారం కోల్పోయాకా చింతమనేని కథ మారింది.
ఆయనపై పాత కేసుల విచారణలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. వాటికి భయపడి కొన్నాళ్లు ఆయన పారిపోయారు. అయితే చివరకు ఆయనను పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ చేశారు. ఒక్కో కేసులో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఆయనకు నాలుగు కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. జైల్లోనే చింతమనేనిని అరెస్టు చేస్తూ వస్తున్నారు పోలీసులు.
ఈ క్రమంలో ఆయనను ఐదో కేసులో అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ నాలుగు కేసుల్లో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేసి, తమ అదుపులోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఐదోసారి అరెస్టును చూపించి చింతమనేనిని పోలీసులు కస్టడీకి కోర్టును కోరనున్నారని తెలుస్తోంది.
చింతమనేనిపై ఏకంగా యాభై కేసుల వరకూ పెండింగ్ లో ఉన్నాయంటే.. ఇంకా ఈయనను ఎన్ని కేసుల్లో అరెస్టు చేయాల్సి ఉందో తెలుగుదేశం పార్టీ వాళ్లే లెక్కలేసుకోవాలి. ఈ కేసులన్నీ తెలుగుదేశం హయాం నాటివే. కొత్తగా ఈయన మీద పెట్టిన కేసులు ఏమీలేవు. అన్నీ పాత కేసులే. అప్పట్లో ఈయన బాధితులు చేసిన ఫిర్యాదులే. ఇప్పుడు విచారణలు జరుగుతూ ఉన్నాయంతే.
ఇప్పటి వరకూ ఒక కేసులో చింతమనేనికి జైలుశిక్ష కూడా పడింది. కాంగ్రెస్ హయాంలో మంత్రి వసంతకుమార్ పై భౌతిక దాడి నేపథ్యంలో.. ఈయనను దోషిగా తేల్చి న్యాయస్థానం జైలు శిక్షను కూడా విధించింది.