ఔట్ డేటెడ్ నేత‌ల‌తో క‌డ‌ప టీడీపీలో కొత్త చిక్కులు!

వీర శివారెడ్డి, డీఎల్ ర‌వీంద్రారెడ్డి, వ‌ర‌ద‌రాజుల రెడ్డి… వీళ్లంతా అతి త్వ‌ర‌లో తెలుగుదేశం పార్టీ లో మ‌ళ్లీ పున‌రుత్తేజం కాబోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనే ట్యాగ్ లైన్లు వీరికి…

వీర శివారెడ్డి, డీఎల్ ర‌వీంద్రారెడ్డి, వ‌ర‌ద‌రాజుల రెడ్డి… వీళ్లంతా అతి త్వ‌ర‌లో తెలుగుదేశం పార్టీ లో మ‌ళ్లీ పున‌రుత్తేజం కాబోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనే ట్యాగ్ లైన్లు వీరికి ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా వీరిపై ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కం ఎంత అనేది ప్ర‌త్యేకంగా వివ‌రించ‌న‌క్క‌ర్లేని అంశం. 

ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండ‌లేక‌పోవ‌డం, అవ‌స‌రం తీరిన త‌ర్వాత ఎవ‌రినైనా ఏదైనా అన‌గ‌ల‌గ‌డం, త‌మ మాట చెల్లుబాటు కావాల‌నే త‌త్వంతో .. వీరు రాజ‌కీయంగా అనేక రకాలుగా అడుగులు వేశారు. మ‌రి ఈ ఫ‌లితంగా వీరు రాజ‌కీయం నిరుద్యోగులుగానే ఎక్కువ కాలం గ‌డ‌పాల్సి వ‌స్తోంది కూడా!

అధికారం ఎటు వైపు ఉంటే అటు వైపు మొగ్గు చూపే త‌త్వ‌మే అయినా, ఎందుకో వైఎస్ జ‌గ‌న్ ఈ బ్యాచ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఒక్క‌రూ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే త‌ను కూడా వైఎస్ జ‌గ‌న్ వైపే అనిపించుకున్నా.. ఆ త‌ర్వాత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఆయ‌న‌కు పెద్ద‌గా స్థానం ద‌క్క‌లేదు. 

వైఎస్ మ‌ర‌ణించిన త‌ర్వాత వైఎస్ పైన‌, జ‌గ‌న్ పైన తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తిన వారిలో డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఉంటారు. అప్ప‌ట్లో ఆ కోటాలో కిర‌ణ్ కుమార్ రెడ్డి వ‌ద్ద డీఎల్ కు చోటు ల‌భించినా, కిర‌ణ్ తో కూడా డీఎల్ ఎక్కువ కాలం పాటు ప్ర‌యాణాన్ని కొన‌సాగించ‌లేక‌పోయారు!

ఆ త‌ర్వాత రాజ‌కీయంగా డీఎల్ యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రించింది త‌క్కువే కానీ.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు డీఎల్ మ‌ళ్లీ తెలుగుదేశం వైపు చూస్తున్నార‌నే వార్త‌లు రానే వ‌స్తున్నాయి.

ఇక వీర‌శివారెడ్డి కూడా డీఎల్ ర‌వీంద్రారెడ్డి బాట‌లోనే న‌డిచారు కొంత కాలం పాటు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు స‌న్నిహితులుగా చ‌లామ‌ణి అయ్యి, ఆయ‌న మ‌ర‌ణించిన త‌ర్వాత వైఎస్ పై అక్క‌సు వెల్ల‌గ‌క్కిన వారిలో వీర‌శివుడున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిన త‌ర్వాత వీర‌శివారెడ్డి ఆట‌లో అర‌టిపండ‌య్యారు. 

ఇప్పుడు మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ ద్వారా మార‌కంలోకి రావాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నారు వీర‌శివారెడ్డి. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నాయుడుల‌తో కూడా వీర‌శివారెడ్డి స‌మావేశాలు పూర్త‌య్యాయ్యి. వ‌ర‌ద‌రాజుల రెడ్డి కూడా ఇదే బాట‌న ప‌య‌నిస్తూ తెలుగుదేశం పార్టీలో మ‌ళ్లీ యాక్టివ్ పొలిటీషియ‌న్ అయ్యే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలుస్తోంది.

అయితే ఈ ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ల వ‌ల్ల తెలుగుదేశం పార్టీలో ఇప్ప‌టికే ఉన్న నేత‌లు నొచ్చుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌డ‌ప జిల్లా పూర్వ‌స్వ‌రూపంలో తెలుగుదేశం పార్టీ సాధించుకునే ప‌రిస్థితి ఏమీ లేదు. ఇలా నేప‌థ్యంలో ఉన్న ఇన్ చార్జిలు మాత్రం ఆ నేత‌ల ఎంట్రీపై గుర్రుగా ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. వారి వ‌ల్ల ప్ర‌యోజ‌నాల క‌న్నా పార్టీలో కీచులాటలు తీవ్రం కావ‌డం కాద‌నేది లోకల్ టాక్.