జనసేనాని పవన్‌కల్యాణ్ ఎట్టకేలకు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి. అక్టోబర్ 5న విజయదశమి నాడు తిరుపతి నుంచి ఎన్నికల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. విజయం సాధించడానికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయనే ఆకాంక్షతో విజయదశమి నాడు ప్రజల వద్దకు వెళ్లడానికి పవన్ నిర్ణయించినట్టు జనసేన కార్యకర్తలు చెప్పారు.
పవన్ ఎన్నికల టూర్‌కి సంబంధించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడానికి పవన్ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. దసరా రోజు బస్సు యాత్ర మొదలు పెట్టి ఆరు నెలల్లో రాష్ట్రమంతా తిరుగుతారన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో పవన్ పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు. పవన్ పర్యటనకు ముందుస్తు ఎన్నికలే కారణమని చెబుతున్నారు.
వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జగన్ ముందుస్తు ఎన్నికలకు వెళతారని జనసేన నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ సమాయత్తం కావడంలో భాగంగానే పవన్ పర్యటించనున్నారని చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా తిరుపతిలో పవన్ పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో, అక్కడి నుంచే ప్రారంభిస్తుండడం విశేషం. తాను పోటీ చేసే నియోజకవర్గం కావడంతో పాటు ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నుంచి ప్రచారం మొదలు పెట్టడం శుభసూచికంగా పవన్ భావిస్తున్నారని తెలిసింది.
ఇప్పటికైనా పవన్ ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.