అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన తమ్ముడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి మధ్య విభేదాలున్నాయి. అన్న నాయకత్వాన్ని తమ్ముడు ఒప్పుకోవడం లేదు. 2024లో తనకే టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఉరవకొండ టికెట్ కాంక్షను ఆ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నేరుగా మధు వెల్లడించారు.
అన్నను గెలిపించుకుని రావాలని జగన్ తేల్చి చెప్పారు. అది కాదని, తనకే కావాలని జగన్ వద్ద మారాం చేయడానికి మధు యత్నించారని సమాచారం. దీంతో జగన్ కాస్త కఠినంగానే చెప్పింది చేసుకురావాలని ఆదేశించినట్టు తెలిసింది. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉరవకొండ టికెట్ విషయమై మధుకు తేల్చి చెప్పారు. అన్నతో వుంటేనే నీకు మంచి భవిష్యత్ వుంటుందని సజ్జల స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మధు నిరాశనిస్పృహలతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. విశ్వేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా మధును సొంత పార్టీలోని నేతలు ఎగదోస్తున్నారనేది బహిరంగ రహస్యమే. వారి అండ చూసుకుని మధు అప్పుడప్పుడూ అన్నపై మధు కాలు దువ్వేందుకు యత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డికి వైసీపీ ఎమ్మెల్సీ, మధు వ్యతిరేకంగా పని చేయడం వల్లే పార్టీ ఓడిపోయిందని అధిష్టానానికి బాగా తెలుసు.
ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్సీ సమీప బంధువైన అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదన్నది కూడా వారికి తెలుసు. అయినా వారు తీరు మార్చుకోలేదు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మధు మరోసారి విశ్వేశ్వరరెడ్డిపై విమర్శలు గుప్పించడం వైసీపీ అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. ఈ పరిణామంపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా ఉరవకొండలో వైసీపీకి నష్టం కలిగిస్తున్న నేతలపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.