ఆమె పాదయాత్ర చేస్తే పట్టుమని వంద మంది కూడా కనపడలేదు. పార్టీకి క్యాడర్ లేదు. పెట్టుబడి లేదు. కేవలం వైఎస్ఆర్ అనే ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని మాత్రమే షర్మిల రాజకీయ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆమెది నిష్ఫల యాత్రగానే కనిపించింది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ షర్మిల పార్టీ పోటీ చేయ లేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా షర్మిల పార్టీ తరఫున పోటీకి యమ ఉత్సాహంగా ముందుకు వచ్చే వారెంతో మంది ఉండకపోవచ్చు కూడా! స్వయంగా షర్మిల ఎక్కడైనా పోటీ చేసి నెగ్గగలదా? అనేది కూడా కొశ్చన్ మార్కే!
మరి తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రస్థానంలో ఇన్ని లోటుపాట్లు కనిపిస్తున్నా.. ఆమె మొండితనం, పోరాట ధోరణి మాత్రం ఔరా అనిపిస్తోంది! సాధారణంగా రాజకీయ నేతలు ఏదో వస్తుందంటే తప్ప అడుగుకూడా ముందుకు వేయరు. వారేం చేసినా అందులో ఏదో వ్యూహముంటుంది. ఎన్నో లెక్కలు వేసుకుని కానీ వారు ఏదీ చేయరు! అందులోనూ షర్మిలకు మరీ ఇంత కష్టపడిపోవాల్సినంత కష్టం కూడా ఏమీ లేదు.
తెలంగాణలో రాత్రికి రాత్రి రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవడం సాధ్యం కాదని షర్మిలకు మొదటే తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా.. పార్టీ పెట్టిన కొన్నాళ్లకైనా తత్వం బోధపడి ఉంటుంది. అయినా షర్మిల వెనుకంజ వేయకపోవడమే అత్యంత ఆసక్తిదాయకమైన అంశం!
తెలంగాణ రాజకీయంలో షర్మిల నిలదొక్కుకోగలదా, నిలదొక్కుకోలేదా, ప్రజాదరణ ఉంటుందా, ఉండదా, ఆమె పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఆమె స్వయంగా గెలవగలదా.. లేదా.. ఇదంతా చర్చ కాదు! అయితే మొండిగా పోరాడటంలో, అమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధం కావడంలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు తనేమీ తీసిపోనని షర్మిల చాటుకుంటోంది. వారి పోరాటధోరణినే కొనసాగిస్తోంది. అయితే వైఎస్, జగన్ ల పోరాటానికి క్యాడర్, పార్టీ నిర్మాణం.. పునాది, గోడలుగా నిలిచాయి. కానీ షర్మిల పోరాటానికి క్యాడర్, పార్టీ స్ట్రక్చర్ రెండూ లేవు.
ఒకవేళ ఏ కాంగ్రెస్ పార్టీనో షర్మిలను నాయకురాలిగా తెచ్చుకుని ఉంటే.. ఈ తరహా పోరాట ధోరణి ఆ పార్టీ పరిస్థితిని ఎంతో మెరుగుపరిచేవి!