తమిళ నటుడు విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి కలుస్తున్నారు. తన కెరీర్ లో 67వ చిత్రంగా ఈ సినిమా చేయబోతున్నాడు విజయ్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం విశాల్ ను అనుకున్నాడు దర్శకుడు. అయితే ఆ ఆఫర్ ను విశాల్ తిరస్కరించాడు. దీంతో కోలీవుడ్ లో విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. విశాల్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంపై విశాల్ స్పందించాడు. విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించడానికి కారణాల్ని వెల్లడించాడు. అంతేకాదు, వీలైతే విజయ్ ను డైరక్ట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు.
“విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరించాల్సి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ కమిట్ మెంట్స్ ఉండడం వల్ల ఈ పని చేయాల్సి వచ్చింది. అంతకుమించి మరో కారణం లేదు. భవిష్యత్తులో నాకు మరిన్ని అవకాశాలొస్తాయి. ఏదో ఒక టైమ్ లో విజయ్ కు ఓ స్టోరీ నెరేట్ చేస్తాను, అతడ్ని నేను డైరక్ట్ చేయాలనుకుంటున్నాను.”
ఇలా విజయ్ సినిమా ఆఫర్ ను తిరస్కరిస్తూనే, అతడ్ని డైరక్ట్ చేయాలనుందనే కోరికను బయటపెట్టాడు విశాల్. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో, విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా అంతే బలంగా ఉంటాయి.
మాస్టర్, విక్రమ్ సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా విజయ్ సేతుపతిని చూపించాడు లోకేష్.ఇక విక్రమ్ సినిమా క్లయిమాక్స్ లో సూర్యను గ్యాంగ్ స్టర్ గా కూడా పరిచయం చేశాడు. విజయ్ సినిమాలో కూడా ఇలాంటి ఓ బలమైన పాత్ర ఉంది. దాని కోసం విశాల్ ను సంప్రదించాడు. కానీ విశాల్ తిరస్కరించాడు.