భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకోనున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన నారావారిపల్లెకు రావడం విశేషం. అంతేకాదు, ఈ నెల 17వ తేదీ వరకూ అక్కడే ఉండాలని నిర్ణయించుకోవడంపై చర్చ జరుగుతోంది.
చంద్రబాబు అధికారంలో వుండగా ప్రతి సంక్రాంతికి నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లెకు వెళ్లేవి. ఊళ్లో సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునే వారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తుగా నారావారిపల్లెకు చేరుకుని శుభాకాంక్షలు చెప్పడం బాబు పాలనలో ఆనవాయితీగా జరిగేది.
అయితే అధికారం పోవడం, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో ఇల్లు కదిలి బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేకపోయింది. ఇందుకు నారా కుటుంబం కూడా అతీతం కాదు.
ఈ నేపథ్యంలో ఆకస్మికంగా లోకేశ్ నారావారిపల్లెకి వెళ్లాలనుకోవడం చర్చనీయాంశమైంది. వచ్చే నెలలో ఆయన కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్న సంగతి తెలిసిందే. తండ్రితో సంబంధం లేకుండా భార్య, కుమారుడితో లోకేశ్ స్వస్థలానికి రావడం, వారం పాటు ఉండాలని అనుకోవడం వెనుక కారణం ఏమై వుంటుందా? అనే చర్చకు తెరలేచింది.