రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు అనేక రకాల కష్టాలు వచ్చాయి. అప్పటిదాకా రెండు ప్రాంతాలు అనే వ్యత్యాసాలు పట్టించుకోకుండా తెలంగాణలో పలువురు సీమాంధ్రులు సెటిలయ్యారు. కొన్ని తరాలుగా ఇక్కడే ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. విభజన తర్వాత.. అలాంటి వారు కూడా తమ కుటుంబాలు వారసుల సహా ఆంద్రప్రదేశ్ కు వెళ్లిపోవాలని అనుకున్నారు. అయితే స్థానిక కోటాలో విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు పొందడానికి అర్హత లభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఏర్పాటుచేసింది.
ఏడేళ్ల వ్యవధి వరకు తెలంగాణ ప్రాంతంనుంచి ఎవరైనా ఏపీకి వెళ్లి తమకు నచ్చిన చోట స్థిరపడదలచుకుంటే గనుక.. అక్కడ స్థానికులుగా ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని చట్టంలో ఏర్పాటుచేసింది. తాజాగా ఈ గడువును పదేళ్లకు పెంచారు. అంటే ఇప్పటికి కూడా.. తెలంగాణలో స్థిరపడిన ఎవరైనా సరే.. తమకు తెలంగాణ వద్దు ఏపీకి వెళ్లిపోయి అక్కడ స్థానికులుగా గుర్తింపు పొందాలి. అక్కడ స్థానికులు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందాలి అనుకుంటే వారికి ఇంకా వెసులుబాటు ఉంది.
నిజానికి రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ సర్కారు సీమాంధ్రుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే భయంతో వేల కుటుంబాలు తమ తమ సొంత ప్రాంతాలకు తిరిగి వలస వెళ్లిపోయాయి. చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, చిరు వ్యాపారాల్లో స్థిరపడ్డివారు ఇలా అనేకులు తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. కానీ కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా.. సీమాంధ్రులను టార్గెట్ చేయడం లాంటి అవాంఛిత పరిణామాలేమీ జరగనేలేదు.
సామాజిక వాతావరణం ఎప్పటిలాగానే ఉండిపోయింది. తిరిగి ఏపీకి వెళ్లే ఆలోచనలేని, వెళ్లగలిగే వెసులుబాటు లేని రీతిలో తెలంగాణలో సెటిలైన వారు ఇక్కడే ఉండిపోయారు. ఏపీకి వెళ్లి అక్కడ స్థానిక హోదా పొందడానికి కేంద్రం ఇచ్చిన గడువు ఏడేళ్లు కూడా దాటిపోయింది.
అయితే రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లిపోయి అక్కడే స్థానికులుగా బతకాలని కోరుకునే వారికి గడువు పొడిగించింది. పదేళ్ల వరకు పెంచింది. అంటే 2024 వరకు తెలంగాణలోని వారు ఏపీకి వెళ్లిపోయి అక్కడే స్థానికులుగా జీవించడానికి గుర్తింపు పొందవచ్చు. అయితే ఇలాంటి వెసులుబాటు ఒక్కొక్కరికి ఒకసారి మాత్రమే లభిస్తుంది.
విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించి.. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం ఇప్పటిదాకా చేతకాని కేంద్రం.. సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయి గనుక.. ప్రజలు తిరిగి ఏపీకి వెళ్లిపోవడానికి తగిన గడువు పెంచడమే తమాషా!