ఇన్నేళ్లు తెలంగాణాకు, ఆ రాష్ట్ర సమస్యలకు మాత్రమే పరిమితమైన కేసీఆర్ బీ ఆర్ ఎస్ ఏర్పాటుతో ఆ పరిధి దాటిపోయారు. ఆయన జాతీయ నాయకుడు ఆయాడో లేదో చెప్పలేంగానీ ఆయన పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. అందువల్ల దేశంలోని ప్రతి సమస్య మీదా, ప్రతి విధానం మీదా ఆయన (అంటే బీ ఆర్ ఎస్) తన అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది.
ఫలానా రాష్ట్ర సమస్యల మీద నా అభిప్రాయం చెప్పను అనడానికి వీలులేదు. ఎందుకంటే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేశారుగానీ అది ఇంకా జాతీయ పార్టీగా ఎదగలేదు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే నిర్దేశిత రాష్ట్రాల్లో నిర్దేశిత ఓట్లు, సీట్లు సాధించాల్సి ఉంటుంది.
అందువల్ల బీ ఆర్ ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలను, ప్రజలను ప్రభావితం చేసే అంశాలను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. బీ ఆర్ ఎస్ పోటీ చేయాలనుకుంటున్న రాష్ట్రాల్లో పొరుగున ఉన్న ఏపీ తప్పనిసరిగా ఉంటుంది. అదీ తెలుగు రాష్ట్రమే కాబట్టి పోటీ చేయాలనుకోవడం సహజం. కాబట్టి అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది.
ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలా? మూడు రాజధానులు అవసరమా? అనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఏపీకి వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారకుడు కేసీఆరే అనే అభిప్రాయం ఏపీ ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. ఆయన అన్నా, ఆయన పార్టీ అన్నా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఇటువంటి తరుణంలో ఏపీలో పోటీచేస్తారా? అనే సందేహం పలువురిని వెంటాడుతున్నప్పటికీ ఏపీ ప్రజలు కుల రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తుండటం ఆయనకు వరంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కేసీఆర్ కు సన్నిహితుడే. టీడీపీ ప్రభుత్వ హయాంలోరాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తున్నారని, తెలంగాణ తరఫున సహాయ సహకారాలందిస్తామని అప్పటి సభలో ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనను వారు కూడా స్వాగతించారు. తర్వాత ఏర్పడిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులే తమ విధానమని ప్రకటించడంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు ఒక విడత పాదయాత్ర చేశారు. మరో విడత పాదయాత్ర చేస్తూ మధ్యలో నిలిపివేశారు. విశాఖ, కర్నూలులోని బహిరంగసభల్లో వికేంద్రీకరణ గురించి మంత్రులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం కీలకంగా మారబోతోంది. తెలుగుదేశం, ప్రతిపక్షాలు అమరావతి అని, వైసీపీ మూడు రాజధానులంటూ ఎన్నికలకు వెళ్లబోతున్నారు. ఇటువంటి తరుణంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీ ఆర్ ఎస్ విధానం ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.
అమరావతా? మూడు రాజధానులా? అనేదానిపై తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. కేసీఆర్ చెప్పేదాన్ని బట్టే ఏపీ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యారు కాబట్టి బీఆర్ఎస్ కు ఇది చాలా సున్నితమైన విషయంగా మారింది. ముందుగా రాష్ట్రంలో ఒకటి, రెండు బహిరంగసభలు ఏర్పాటుచేసి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే రాజధానిపై తన వైఖరిని తెలియజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.