ఆస్పత్రికి షర్మిల తరలింపు.. కేసీఆర్ మెట్టు దిగాల్సిందే!

ప్రజాపోరాటాల విలువ తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన దాకా వచ్చేసరికి అలాంటి శాంతియుత నిరసన పోరాటాలను చూసి జడుసుకుంటున్నట్టున్నారు. వైఎస్ షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగించడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపిన…

ప్రజాపోరాటాల విలువ తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన దాకా వచ్చేసరికి అలాంటి శాంతియుత నిరసన పోరాటాలను చూసి జడుసుకుంటున్నట్టున్నారు. వైఎస్ షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగించడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపిన పోలీసులు, ఆమె ఆమరణ నిరాహార దీక్షను బలవంతంగా భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం నుంచే షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆమెను విడతలు విడతలుగా పరీక్షిస్తున్న వైద్యులు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పెద్దసంఖ్యలో లోటస్ పాండ్ కు చేరుకున్న పోలీసులు షర్మిలను అరెస్టు చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు. 

కేసీఆర్ ప్రభుత్వం తీరు పట్ల వైఎస్ షర్మిల చేస్తున్న ప్రజాస్వామ్యయుత పోరాటం తారస్థాయికి చేరుకుంటోంది. ఆమె పోరాటానికి ప్రజాదరణ పెరుగుతోందనే ఉద్దేశంతో కేసీఆర్ దానిని సహించలేకపోతున్నారు. వరంగల్ లో తెరాస శ్రేణులు ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, ఘర్షణలు అరెస్టులు ఇందుకు పెద్ద ఉదాహరణ. మరునాడు ప్రగతి భవన్ ను ముట్టడించడానికి షర్మిల ప్రయత్నించినప్పుడు పోలీసులు ప్రదర్శించిన వైఖరి.. రాష్ట్రవ్యాప్తంగా ఆమెను హీరోయిన్ ను చేసింది. ఒక నాయకురాలి దీక్షపట్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ పోలీసులు అంత అమానుషంగా వ్యవహరించలేదనే అపకీర్తి వారికి దక్కింది. ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరినంచడంతో ఆమె ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 

అయితే.. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీల వారికీ గళమెత్తి తమ వైఖరి చెప్పడానికి అవకాశం ఉంటుంది. బిజెపి కాంగ్రెస్ నాయకులు కూడా కేసీఆర్ పై తమ యాత్రలు, సభలో ఏ రేంజిలో నిందలు వేస్తుంటారో అందరికీ తెలుసు. అయితే షర్మిల విషయంలో మాత్రం కేసీఆర్ ఎందుకింత పట్టుదలగా తొక్కేయాలని చూస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో పార్టీల పోరాటాల విలువ గురించి కేసీఆర్ కు బాగా తెలుసు. తెలంగాణ సాధన కోసం ఆయన సాగించిన నిరాహారదీక్షను కూడా ఆ పార్టీ వారు ఇప్పటికీ ఒక ఉత్సవంలాగా ప్రతి ఏడాదీ గుర్తుచేసుకుంటారు. అలాంటిది.. షర్మిలకు అనుమతులు ఇవ్వకపోగా, దీక్షను భగ్నం చేయడం చిత్రం. 

ఈ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. షర్మిల ఇతర నాయకుల్లాగా కాదని, ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తుందని తిరిగి ఇంటికి వస్తే మళ్లీ దీక్ష కొనసాగుతుందని అంటున్నారు. కోర్టు ద్వారా తన పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవడం చాలా సునాయాసమైన విషయం అయినప్పటికీ.. పోరాటం ద్వారానే సాధించుకోవాలని షర్మిల కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మెట్టు దిగే వరకు ఆమె పోరాటం సాగుతుంది.