స్టీల్ ప్లాంట్ కొనేందుకు రేసులో విదేశీ కంపెనీలు

విశాఖ స్టీల్ ప్లాంట్ అంగట్లో నిలబడింది. దాన్ని కేంద్రం అలా నిలబెట్టింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం అన్నది ఒక వ్యూహాత్మకమైన ప్రక్రియగా కేంద్రం చెప్పుకుంటోంది. ఇది అనివార్యం అని స్పష్టం చేస్తోంది. దాదాపుగా రెండేళ్ళ…

విశాఖ స్టీల్ ప్లాంట్ అంగట్లో నిలబడింది. దాన్ని కేంద్రం అలా నిలబెట్టింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం అన్నది ఒక వ్యూహాత్మకమైన ప్రక్రియగా కేంద్రం చెప్పుకుంటోంది. ఇది అనివార్యం అని స్పష్టం చేస్తోంది. దాదాపుగా రెండేళ్ళ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ఉక్కు కార్మిక సంఘాలు, ఉద్యోగులు అంతా ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేంద్రం కరగడం లేదు సరికదా దూకుడు అంతకంతకు పెంచుతోంది

విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ విధివిధానాలను ఖరారు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రీవేటీకరణ కోసం కేంద్రం దీపం పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీపం కార్యదర్శి తుహీన్ కాంత్ పాండే తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తధ్యమని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సాఫీగా సాగేలా ఇప్పటికే దీపం నుంచి ఆహ్వానాలు మేరకు  లీగల్ కన్సెల్టీకి, సలహాదారుల నియామకం కోసం కూడా బిడ్లను దాఖలు చేశారు.కొనేందుకు దేశేయ కంపెనీలతో పాటు విదేశీయ కంపెనీలు కూడా ఇపుడు రేసులోకి దూసుకువస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని దక్కించుకోవడానికి పోటీ గట్టిగానే ఉంది. విశాఖ జిల్లా కలెక్టర్ నుంచి ఎప్పటికపుడు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన సమాచారాన్ని కేంద్రం సేకరిస్తూ ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది.

స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ అమలు ఏ విధంగా సాగుతోంది అన్న దాని మీద కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది. వివరాలను ఉక్కు యాజమాన్యం నుంచి సేకరిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పరం చేయవద్దు అని సెయిల్ లో విలీనం అయినా చేయాలని మరో ప్రతిపాదన కార్మిక సంఘాల నుంచి వస్తోంది.

కానీ అమ్మకానికే కేంద్రం డిసైడ్ అయింది. బహుశా కొత్త ఏడాదిలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేసే ప్రక్రియను పూర్తి  చేస్తారని అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన దేశ విదేశీ కంపెనీలు విశాఖ ఉక్కు కోసం పోటీ పడుతున్నాయి. ఎవరికి దక్కించుకుంటారో చూడాలి.