'అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బీజేపీ తీర్మానం చేసినది వాస్తవమే, రాయలసీమలో హై కోర్టు ఉండాలనేది భారతీయ జనతా పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఉంది. మూడు రాజధానుల ఫార్ములాకు బీజేపీ వ్యతిరేకం అయినా, ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మాత్రం లేదు..' అని అంటోంది భారతీయ జనతా పార్టీ. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ఆయన నిర్ణయంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడి తీరును ఏపీ బీజేపీ తప్పు పట్టింది. గవర్నర్ నిర్ణయానికి రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడం సరి కాదని చంద్రబాబు నాయుడుకు తలంటింది భారతీయ జనతా పార్టీ. చంద్రబాబులా తాము రాజకీయ ఆరోపణలు చేయడం లేదని బీజేపీ స్ఫష్టం చేసింది. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా ప్రకటించింది.
రాష్ట్రాల రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించి గవర్నర్ ఆమోదించి ఉండవచ్చని ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని కమలం పార్టీ పేర్కొంది. తాము మూడు రాజధానుల ఫార్ములాకు అనుకూలం కాకపోయినా, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ తీర్మానం చేసినా.. గవర్నర్ ఆమోదం పొందని అంశంపై అభ్యంతరం వ్యక్తం చేయడం కాని, రాజకీయ వ్యాఖ్యలు చేయడం కానీ జరగదని బీజేపీ స్పష్టం చేసింది. అలాంటి పని మానుకోవాలని చంద్రబాబుకు కూడా సూచించినట్టుగా స్పందించింది బీజేపీ.
అయితే బీజేపీ తన ఎన్నికల మెనిఫెస్టోని తనే తుంగలో తొక్కుతున్నట్టుగా ఇక్కడ స్పందించింది. రాయలసీమలో హై కోర్టు అంటూ ఎన్నికల మెనిఫెస్టోలో తాము ప్రకటించిన విషయాన్ని బీజేపీనే గుర్తు చేసింది. జగన్ ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నా.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ తాము తీర్మానం చేసినట్టుగా బీజేపీనే చెప్పుకుంది. ఇలా తమ ఎన్నికల మెనిఫెస్టోకి వ్యతిరేకంగా తామే తీర్మానం చేసినట్టుగా బీజేపీనే స్పష్టం చేసింది.