ప్లాస్మా థెరపీ.. కోవిడ్-19 చేత తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి చికిత్సకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 సోకిన వారిలో కూడా చాలా తక్కువ మందికే ప్లాస్మా థెరపీ అవసరం ఉంటుందట. అయితే అలాంటి వారికి కూడా ఏపీ వంటి రాష్ట్రంలో బ్లడ్ డోనర్లు దొరకని పరిస్థితి. అప్పటికే కోవిడ్ -19 కు గురై, కోలుకుని కనీసం కొన్ని రోజులు అయ్యి, శరీరంలో యాంటీబాడీస్ పెంపొందించుకున్న వాళ్లు బ్లడ్ డొనేట్ చేస్తే, దాన్ని ఎక్కించి కొంతమందిని కరోనా నుంచి కోలుకునే చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ వంటి రాష్ట్రంలో కోవిడ్-19 పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఏపీలో ఈ విషయంలో అంత అవగాహన లేదు. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో ఇప్పటి వరకూ బ్లడ్ డొనేషన్ కు ముందుకు వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. వేల సంఖ్యలో కోలుకున్న పేషెంట్లు ఉన్నా, తెలియక కొంతమంది-భయంతో మరి కొంతమంది బ్లడ్ డొనేషన్ కు ముందుకు రాలేదు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఒకరు కరోనా నుంచి కోలుకుని బ్లడ్ డొనేట్ చేశారు. ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతూ ఉంది.
ఈ క్రమంలో బ్లడ్ డొనేషన్ కు ముందుకు వచ్చిన కోవిడ్ -19 రికవరీ వ్యక్తులకు ఐదు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బ్లడ్ డొనేషన్ పట్ల ఆసక్తి ఉన్నా, తమ ఆరోగ్యం పట్ల ఆందోళనలతో కొంతమంది ముందుకు రాకపోవచ్చు. మంచి ఆహారం తీసుకుంటే అలాంటి వారిలో మళ్లీ రక్తం పడటానికి పెద్ద సమయం పట్టకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. వారి పరిస్థితి మెరుగ్గా ఉంటేనే వైద్యులు కూడా రక్తం తీసుకుంటారు. లేకపోతే తీసుకోరు కూడా. ఇలాంటి నేపథ్యంలో డోనర్లు ఆ తర్వాత మంచి ఫుడ్ తీసుకోవడానికి అయినా ఆ ఐదు వేల రూపాయల మొత్తం ఉపయోగపడుతుంది. ఆ మాత్రం తెగువతో బ్లడ్ డొనేషన్ కు ముందుకు వచ్చిన వారికి ఆ ప్రోత్సాహకం మంచిదే. ప్రోత్సాహకం అవసరం లేదనే వారు ఇంకా గొప్ప వాళ్లు. మొత్తానికి కరోనా నివారణ విషయంలో జగన్ చూపుతున్న చొరవ మాత్రం అడుగడుగునా అభినందనీయంగా ఉంది.