బాబుకిదే లాస్ట్ & గోల్డ‌న్ చాన్స్

మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేయ‌గానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న స‌హ‌జ ధోర‌ణిలో డ్రామాకు తెర‌లేపారు. అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల బిల్లులపై చ‌ర్చ సంద‌ర్భంగా కూడా ఇదే ర‌క‌మైన నాట‌కాన్ని…

మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేయ‌గానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న స‌హ‌జ ధోర‌ణిలో డ్రామాకు తెర‌లేపారు. అసెంబ్లీలో మూడు రాజ‌ధానుల బిల్లులపై చ‌ర్చ సంద‌ర్భంగా కూడా ఇదే ర‌క‌మైన నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించ‌డం చూశాం. ‘వ‌య‌స్సులో చిన్న వాడివైనా…చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా. ద‌య‌చేసి మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకోండి’ అంటూ చెమ్మ‌గిల్లిన క‌ళ్ల‌తో మామ‌ను మించిన న‌టుడ‌ని నిరూపించుకున్నాడు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో చంద్ర‌బాబు మ‌రోసారి భావోద్వేగానికి గుర‌య్యారు. విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ అమ‌రావ‌తి త‌ర‌లింపు నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. న్యాయ‌స్థానాల ద్వారా రాజ‌ధాని అమ‌రావ‌తిని కాపాడుకుంటామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న రాజ‌కీయాల గురించి సెంట్‌మెంట్ వ్యాఖ్య‌లు చేశారు. ఆవేంటో తెలుసుకుందాం.

‘అమరావతిలాంటి ప్రాజెక్టును చంపేస్తున్నారంటే కళ్ల వెంట నీళ్లు తిరుగుతున్నాయి. నేను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను. నాకు ఇంకేం కావాలి. నేను సుఖపడటానికి అమరావతి కట్టాలనుకోలేదు. నేను ఆరోగ్యంగా ఉంటే మహా అయితే మరో పదేళ్లు ఉంటాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు దానిని అనుభవిస్తారు. ఏదైనా చేస్తే భవిష్యత్‌ తరాలు గుర్తుంచుకోవాలన్న తపనతోనే అమరావతిని దేశానికి ఒక నమూనాగా నిలపాలని ప్రయత్నించాను’…ఇవీ చంద్ర‌బాబు మాట‌లు.

చంద్ర‌బాబు మ‌రో ప‌దేళ్లు మాత్ర‌మే తాను బ‌తికేద‌న్న‌ట్టు మాట్లాడారు. త‌న రాజ‌కీయ అనుభ‌వం గురించి కూడా చెప్పిన నేప‌థ్యం లో చంద్ర‌బాబు గురించి ఆయ‌న మామ‌, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ ఏమ‌న్నారో తెలుసుకుందాం.

‘న‌మ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాం. న‌మ్మిన వాళ్ల గొంతులు కోస్తామ‌ని చెప్పి నిరూపించుకున్న ఘాత‌కుడు వాడు. చరిత్ర మ‌ర‌వ‌దు. ఒక‌ప్పుడు మొగ‌ల్ సామ్రాజ్యంలో  తండ్రిని జైల్లో పెట్టి అన్న‌ను చంపించాడు ఔరంగ‌జేబు. మ‌రి ఈ నాడు అదే విధంగా చంద్ర‌బాబునాయుడు ఏ విధంగా త‌న తండ్రి లాంటి ఎన్టీ రామారావుకు ద్రోహం చేశాడు. కేవ‌లం ప‌ద‌వి కోసం ఏ విధంగా ఆత్మ‌ను అమ్ముకున్నాడో, ఏ విధంగా మాన‌వ‌త్వాన్ని చంపుకున్నాడో ఇదే నిద‌ర్శ‌నం. సాక్ష్యాత్తు ఇది శాశ్వ‌తంగా ఉంటుంది. మ‌నిషి పోతాడేమో కానీ ప్ర‌జ‌ల మ‌న‌సు పోదు. రికార్డు పోదు. అది శాశ్వ‌తం’ అని త‌న ప‌ద‌విని లాక్కున్న సంద‌ర్భంలో ఎన్టీఆర్ భావోద్వేగంగా అన్న‌మాట‌లివి.

ఇక తాజాగా జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై చేసిన ఘాటు వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. ఆయ‌న ఏమ‌న్నారంటే…

‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది.  ఆయన ఏమాత్రం నమ్మదగిన నేత కాదు.  రాజకీయ అవసరాలకు, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మ‌మ్మ‌ల్ని  చంద్రబాబు వాడుకున్నారు. కానీ మా రాష్ట్రానికి సమస్య వచ్చి నప్పుడు స్పందించకుండా ముఖం చాటేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని, ఏపీలో వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తున్నారని అందరికీ తెలుసు. మా నాన్న ఫరూక్‌ అబ్దుల్లా తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో ప్రచారాన్ని విడిచిపెట్టి ఏపీకి వెళ్లి చంద్రబాబు పార్టీ కోసం ప్రచారం చేశారు. మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే చంద్రబాబు మాకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదీ ఆయన నైజం’ అని పేర్కొన్నారు.

అయ్యా చంద్ర‌బాబూ.. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా. పదేళ్లు ప్రతిపక్ష నేతగా…40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలిగా దేశంలో గుర్తింపు పొందిన‌ప్ప‌టికీ…త‌మ‌రిని వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానే భావిత‌రాలు గుర్తించుకుంటాయి. దివంగ‌త మ‌హానేత ఎన్టీఆర్ చెప్పిన‌ట్టు ఆధునిక రాజ‌కీయాల్లో మ‌రో ఔరంగ‌జేబుగా మాత్ర‌మే త‌న‌ను గుర్తిస్తార‌ని చంద్ర‌బాబు మ‌రిచిన‌ట్టున్నారు. ఒమ‌ర్ అబ్దుల్లా చెప్పిన‌ట్టు త‌న రాజ‌కీయ స్వార్థానికి ఎవ‌రినైనా వాడుకోవ‌డం, బ‌లిప‌శువు చేయ‌డంలో చంద్ర‌బాబుకు మించిన నేత లేర‌ని చ‌రిత్ర చెబుతుంది.

కావున రాజ‌కీయ జీవిత చివ‌రి రోజుల్లోనైనా మంచి ప‌నులు చేయ‌డానికి చంద్ర‌బాబు ముందుకు రావాల్సి వుంది. నిజంగా అమ‌రావ‌తి రైతుల‌పై చంద్ర‌బాబుకు ప్రేమాభిమానాలు ఉంటే, నిరూపించుకోడానికి ఇంత‌కు మించిన చివ‌రి, బంగారు అవ‌కాశం మ‌ళ్లీమ‌ళ్లీ దొర‌క‌దు. కేసీఆర్‌లా త‌న స‌భ్యుల‌తో రాజీనామా చేయించి…రాజ‌ధానిపై ఎన్నిక‌ల‌కు వెళ్లాలి. అదే రాజ‌ధాని రెఫ‌రెండం అవుతుంది. క‌ళ్లెదుట ఒక గొప్ప అవ‌కాశాన్ని త‌న చేతుల్లో పెట్టుకుని జ‌గ‌న్ స‌ర్కార్‌ను డిమాండ్ చేయ‌డంలో ఔచిత్యం లేదు. కావున ఆ దిశ‌గా బాబు ఆలోచించి రాజీనామాల దిశ‌గా అడుగులు వేయాలి.

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది