నాయకత్వ లక్షణాలను బట్టి కొందరిని చరిత్ర నిత్యం స్మరించుకుంటూ ఉంటుంది. ఫలానా నాయకుడు లేదా నాయకురాలు జీవించి ఉంటే అది అలా అయ్యేది కాదు, ఈ పాటికి ఇది సాకారం అయ్యేదని రాజకీయాలకు అతీతంగా చర్చించుకుంటారు. అలాంటి లీడర్స్‌నే చరితార్థులు అని లోకం గర్వంగా పిలుచుకుంటుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డినే తీసుకుందాం.
2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధంగా ఆయన సీఎంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏపీలో డాక్టర్ వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండో దఫా కూడా ఆయనే ఏపీ సీఎం అయ్యారు. దురదృష్టవశాత్తు 2009, సెప్టెంబర్ 2న ఆయన ఆకస్మిక మృతి చెందారు.
వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆర్థికశాఖ మంత్రి రోశయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎం చేసింది. రోశయ్య పాలనలోనే టీఆర్ఎస్ నేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రంలో అధికా రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ సీఎం మార్పు చేపట్టింది. రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించింది. ఏదైతేనేం ఉమ్మడి ఏపీకి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా అవతరించాయి. కానీ రాష్ట్ర విభజన గురించి చర్చ వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి ముందు, తర్వాత అని ఖచ్చితంగా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. వైఎస్సార్ బతికే ఉంటే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యేది కాదని స్వయంగా కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ మంత్రి హరీష్‌రావు పలు సంద ర్భాల్లో చెప్పడాన్ని విస్మరించకూడదు. అలాగే రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే విషయాన్ని చెబుతారు. వైఎస్సార్ బతికే ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని, నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని వైఎస్సార్ అంటే అసలు గిట్టని వారు కూడా చెబుతారు.
ఇక ప్రస్తుతానికి వస్తే ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడం కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతించే , వ్యతిరేకించే వాళ్లైనా…ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే…వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నేడు మూడు రాజధానుల అంశమే తెరపైకి వచ్చేది కాదంటున్నారు. ఇది ముమ్మాటికీ నిజం.
ముఖ్యంగా రాజధాని మార్పు చేయాలనే కల కనడమే ఒక సాహసం అని చెప్పాలి. అలాంటిది ఏకంగా మార్పు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ సర్కార్‌పై బెదిరింపులు, కమ్మ ఆధిపత్య మీడియాను అడ్డు పెట్టుకుని విషం చిమ్మడం ఉద్యమంగా సాగింది, ఇంకా సాగుతోంది. జగన్ కాకుండా మరెవరైనా అయితే ఇలాంటివన్నీ ఎందుకొచ్చిన గొడవ అని అసలు అలాంటి ఆలోచనే చేసి ఉండేవాళ్లు కాదు. కానీ అక్కడున్నది జగన్ కదా.
సహజంగా మొండివాడు రాజుకంటే బలవంతుడంటారు. కానీ రాజే మొండివాడైతే? వైఎస్ జగన్ మొండివాడు మాత్రమే కాదు…జగమొండి. అందుకే ఎవరెన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నా…ఎక్కడా అదరక, బెదరక తన లక్ష్యం వైపు క్షిపణిలా దూసుకుపోయారు.
ప్రధాన ప్రతిపక్షం అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో తన వాళ్లంటూ కొందర్నీ పెట్టుకుందనే ఆరోపణలు లేకపోలేదు. అవసరమైన సమయంలో ఆ అస్త్రాలను ప్రయోగిస్తూ….జగన్ సంక్షేమ పాలనకు ఎలా అడ్డంకులు సృష్టిస్తున్నదో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటిది రాజధాని మార్పు లాంటి ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి అవరోధాలు సృష్టిస్తుందో జగన్‌కు బాగా తెలుసు. వాటన్నింటిని తట్టుకుని నిలబడాలంటే మానసికంగా ఎంతో దృఢత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు.
ఆ మానసిక దృఢత్వం, తాననుకున్నది సాధించకోగలననే ఆత్మ విశ్వాసం, గుండె ధైర్యం పుష్కలంగా ఉండడం వల్లే వైఎస్ జగన్ మూడు రాజధానుల కల కన్నారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఆయన నిద్రలేని రాత్రులు వెచ్చించారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడి…లక్షల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాలను సుస్థిరం చేసు కోవాలని కలలు కనింది.
కానీ అలాంటి వాళ్ల అవకాశ వాద , స్వార్థపూరిత కలలను విధ్వంసం చేస్తూ వైఎస్ జగన్ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజ ధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని గట్టిగా నిర్ణయించారు. అందుకు తగ్గట్టు తాజాగా వాటికి సంబంధించిన బిల్లులపై గవర్నర్ సంతకంతో ఒక అంకం ముగిసింది. ఇక న్యాయస్థానంలో ప్రతికూలతను అధిగమించి విశాఖ, కర్నూలు నగరాలకు రాజధానులు తరలడమే ఆలస్యం.
ఎలాగైతే దివంగ వైఎస్ బతికే ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదని చరిత్ర చెబుతుందో…భవిష్యత్ తరాలు వైఎస్ జగన్ ముఖ్య మంత్రి కాకపోయి ఉంటే తమకు రాజధాని వచ్చి ఉండేది కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు తప్పక చెప్పుకుం టారు. అందుకే ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ చరితార్థుడిగా నిలుస్తాడని చెప్పడం.