ఏపీలో కరోనా కంటే మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. మూడు రాజధానుల చుట్టూ ఏపీ రాజకీయం పరిభ్రమిస్తోంది. మూడు రాజధానుల బిల్లులు రెండు వారాలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిశీలనలో ఉన్నాయి. దీంతో ఈ బిల్లుల ఆమోదంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరో వైపు బిల్లులను ఆమోదించవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నాటి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారా యణ సహా అమరావతి రైతులు గవర్నర్కు లేఖలు రాశారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపలేదని, అలాగే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయంటూ ఆ లేఖల్లో ప్రస్తావించారు. న్యాయస్థానంలో విచారణలో ఉన్న బిల్లులపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదంటూ పలు సంస్థలు, వ్యక్తులు గవర్నర్కు పెద్ద ఎత్తున ఉచిత సలహాలు ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు అయితే మరో అడుగు ముందుకేసి పరోక్ష బ్లాక్మెయిల్కు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ సంతకం చేశారు. జగన్ సర్కార్ బిల్లులు పంపింది కాబట్టి గవర్నర్ సంతకాలు చేశారనుకుంటే పొరపాటు. రెండు వారాల పాటు తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన గవర్నర్…తన కార్యాల యానికి బిల్లులు వచ్చినప్పటి నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
రాజధాని బిల్లులు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన విధానం, ఆ తర్వాత మండిలిలో చోటు చేసుకున్న పరిణామాలపై నేరుగా వివరాలు సేకరించారు. బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడం, వాటిపై సెలెక్ట్ కమిటీలు వేయకపోవడంపై శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యుల నుంచి గవర్నర్ నివేదిక తెప్పించుకుని అధ్యయనం చేశారు. ఆ బిల్లులను సెలెక్ట్ కమి టీకి పంపక పోవడానికి గల కారణాలపై శాసనసభ కార్యదర్శి నుంచి వివరణ తీసుకున్నారు.
ముఖ్యంగా ఢిల్లీలోని ప్రఖ్యాత న్యాయ నిపుణులతో ఈ బిల్లులపై చర్చించారు. ఈ బిల్లులు న్యాయ సమీక్షకు లోబడి ఉన్నాయా? లేదా? అనే అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖ న్యాయ కోవిదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాల సమయంలో అన్ని రకాలుగా చర్చించి, అధ్యయనం చేసిన తర్వాతే బిల్లులకు ఆమోద ముద్ర వేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో రెండు వారాలుగా సాగుతున్న ఉత్కంఠకు గవర్నర్ తెరదించినట్టైంది. దీంతో విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమమైంది.