ఎమ్మెల్సీ కవిత ఇవాళ ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆమె స్టేట్మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడేందుకు కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
తమను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయని ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కవిత ఘాటుగా స్పందించారు. తనను అరెస్ట్ చేసుకున్నా భయపడేది లేదని ఆమె తేల్చి చెప్పారు. జైల్లో పెడితే ఏమవుతుందని ఆమె ఇటీవల ప్రశ్నించారు. బీజేపీ నేతల్లా తాము భయపడమని, విచారణను ఎదుర్కొంటామని ఆమె అన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేసీఆర్‌తో కవిత చర్చించడానికే ప్రగతి భవన్‌కు వెళ్లారనే చర్చ నడుస్తోంది. కేవలం విచారణతో సీబీఐ సరిపెడుతుందా? లేక మరింత ముందుకెళుతుందా? అనేది మున్ముందు తెలిసే అవకాశం వుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించడంపై బీజేపీ ఆగ్రహంగా వుంది. ఇందుకు ప్రతీకారంగానే కవితపై సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.