రాజధాని తరలిపోకుండా తను అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టుగా ఆ మధ్య ప్రకటించుకున్నారు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. ఈయన బీజేపీ సభ్యుడిగా చలామణిలో ఉన్న సంగతి తెలిసిందే. అలా బీజేపీ కండువాను మెడలో వేసుకుని అమరావతికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు.
కన్నా లక్ష్మినారాయణ బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుజనా లాంటి వాళ్లు అమరావతి అంటూ మాట్లాడారు. రాజధాని తరలదు అని వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే.. తాజాగా కూడా ఆయన మరోసారి అదే మాటే మాట్లాడారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన నిన్న (గురువారం) ధీమా వ్యక్తం చేసినట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ విభాగం తప్పు పట్టడం గమనార్హం. రాష్ట్రాల రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదని, మూడు రాజధానుల అంశంలో కూడా కేంద్రం అలాంటి వైఖరే అనుసరిస్తుందని ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారమే వ్యాఖ్యానించారు. అందుకు భిన్నంగా ఉంది సుజనా చౌదరి ప్రకటన. ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రకటనను ఏపీ బీజేపీ ఖండించినట్టుగా తెలుస్తోంది. రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదని, ఆ విషయానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడిందని, సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ.. బీజేపీకి వాటితో సంబంధం లేదంటూ బీజేపీ ఏపీ విభాగం తేల్చి చెప్పింది. తద్వారా తనేదో చక్రం తిప్పుతున్నట్టుగా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడి అతి సన్నిహితుడు సుజనా చౌదరి గాలి తీసింది కమలం పార్టీ.
రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ @yschowdary గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం.
రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు స్పష్టం చేశారు. pic.twitter.com/4v2IF6Dare
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 31, 2020