తన కోసమే సినిమాలు తీస్తా..జనం చూస్తే చూడొచ్చు. లేదంటే మానొచ్చు అనే వాదన పదే పదే వినిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి డేంజరస్ అనే మరో సినిమా వచ్చింది.
దాదాపు వారం రోజుల నుంచి ఇటు ట్విట్టర్ లో, అటు యూ ట్యూబ్ లో ఇదే హడావుడి. ఎక్కిన గుమ్మం..దిగే గుమ్మం అన్నట్లుగా, ప్రతి చానెల్ లో ఆర్జీవీ ఇంటర్వూనే. ఆయనను అడిగిన వారు కొంతమంది.. ఆయనే అడిగి మరీ చేయించుకున్న వారు మరి కొంత మంది..ఇలా ప్రతి చోటా ఇంటర్వూలే. ఇవి చాల వన్నట్లు ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్న అషు రెడ్డి ఇంటర్వ్యూ లాంటివి వుండనే వున్నాయి.
ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ అంటూ రకరకాల భంగిమలు ప్రదర్శించారు. పోస్టర్లు వేసారు. నానా హంగామా జరిగిపోయింది. కానీ సాధించింది ఏమిటి? శివ..సత్య లాంటి సినిమాల డైరక్టర్ సినిమా తీస్తే కనీసం ఒక్క సమీక్ష లేదు. పోనీ ట్విట్టర్ లో ఎవరైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. ఈ సినిమాతో పాటు విడుదలైన అనేకానేక సినిమాలకు సమీక్షలు వచ్చాయి. కామెంట్లు వచ్చాయి. ఇంతో అంతో కలెక్షన్లు వచ్చాయి. కానీ సీనియర్ మోస్ట్ డైరక్టర్ ఆర్జీవీ సినిమాను పట్టించుకున్నవారు లేరు.
కనీసం డైరెక్ట్ ఓటిటి లోనో, ఆఖరికి యూ ట్యూబ్ లోనో వదిలినా కనీసం కాస్త రెస్పాన్స్ వుండేదేమో? ఇప్పుడు అదీ లేదు. మరెందుకు ఆర్జీవీ సినిమాలు తీయడం, ప్రమోషన్ కోసం అంత కిందా మీదా పడడం, అమ్మాయిల కాళ్ల దగ్గర కూర్చుని వాళ్ల అంగాంగ వర్ణనలు చేయడం, వారం రోజులు నెటిజన్లకు హడవుడి తప్ప మరేంటీ ఆర్జీవీ సాధించింది?