ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిథిలో శానిటైజర్ తాగి మరణించిన వివిధ ఘటనల్లో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా లాక్ డౌన్ విధించారు. మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. దీంతో కొంతమంది అందుబాటులో ఉన్న శానిటైజర్లు తాగుతున్నారు. అలా ఇప్పటివరకు 9మంది మరణించారు.
నిజానికి శానిటైజర్ తాగితే ప్రమాదమనే విషయం స్థానికులకు తెలుసు. అయితే మొదటి రోజు తాగినప్పుడు ఏమీ కాలేదనే భ్రమతో రెండో రోజు కూడా తాగి ప్రాణాలు కోల్పోయారు చాలామంది. పెరిగిన మద్యం ధరలతో మరికొంతమంది నాటుసారాకు అలవాటుపడ్డారు. అది కూడా తక్కువగానే దొరకడంతో.. నాటుసారాలో శానిటైజర్ కలిపి తాగారు కొంతమంది.
ఇలా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 9 మంది మరణించారు. మరణించిన వాళ్లలో పాతికేళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వ్యక్తులు కూడా ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. ప్రస్తుతం ఇలా శానిటైజర్ తాగిన వ్యక్తుల్లో మరికొంతమంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు.
మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేకంగా పోలీసులు దృష్టిపెట్టారు. శానిటైజర్ తాగితే చనిపోతామని తెలిసి కూడా ఎందుకు తాగుతున్నారనే కోణం కంటే.. ఒకే ప్రాంతం నుంచి ఇంతమంది ఇలా శానిటైజర్లు తాగి చనిపోవడం వెనక ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల షాపుల్లో అమ్ముతున్న శానిటైజర్ల శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపించారు.