ఎట్టకేలకు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేసింది. దీంతో రెండుమూడు నెలలుగా సాగుతున్న నిమ్మగడ్డ వ్యవహారానికి ఫుల్స్టాప్ పడినట్టైంది. ఈ నియామకంతో మన రాజ్యాంగం ఎంత గొప్పదో చెప్పకనే చెబుతోంది. వ్యక్తుల కంటే రాజ్యాంగ వ్యవస్థ సమున్నతమైందని నిమ్మగడ్డ పునర్నియామక ఎపిసోడ్ మరోమారు రుజువు చేసింది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో జగన్ సర్కార్ గుణపాఠం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించినా, గవర్నర్ సూచించినా జగన్ సర్కార్ ఖాతరు చేయలేదు. దీనికి కారణం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండడమే. చివరికి సుప్రీంకోర్టు కూడా ఎస్ఈసీని నియమించాలని ఆదేశించింది. అయినప్పటికీ జగన్ సర్కార్‌లో చలనం లేకపోవడంతో…ఒక దశలో కోర్టు ధిక్కరణకు పాల్పడేందుకు కూడా వెనుకాడరేమోనని, ఏపీ సీఎస్‌ను బలి పశువు చేస్తారేమోననే ఆందోళన కూడా లేకపోలేదు.
ఈ ఆలోచనలు, ఆందోళనల మధ్య గురువారం అర్ధరాత్రి ఎస్ఈసీగా నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికైనా జగన్ సర్కార్ న్యాయస్థానాలకు, రాజ్యాంగానికి విలువ ఇచ్చినందుకు సంతోషించాల్సిందే. ఈ పరిణామాల్ని ఆహ్వానించాల్సిందే. కానీ మున్ముందు ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిమ్మగడ్డ వ్యవహారం నుంచి జగన్ సర్కార్ ఎన్నో గుణపాఠాల్ని నేర్చుకోవాల్సి ఉంది.
మొట్ట మొదటగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను వ్యక్తిగా చూడడం వల్లే ఇలాంటి దుస్థితి. ఆయనకు రాజ్యాంగం అనే గొప్ప ఆయుధం అండగా ఉందని జగన్ సర్కార్ అర్థం చేసుకుని ఉంటే…సంస్కరణల పేరుతో ఆయన తొలగింపునకు తెగబడి ఉండేవారు కాదు. నిప్పుతో అయినా చెలగాటం ఆడొచ్చేమో కానీ, రాజ్యాంగంతో చెలగాటం మంచిది కాదు. రాజ్యాంగంతో చెలగాటం ఆడితే ఏమవుతుందో జగన్ సర్కార్‌కు ఇప్పటికైనా బోధ పడి ఉంటుంది.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహార శైలి కచ్చితంగా అభ్యంతరకరంగా ఉంది. ఇందులో రెండో మాటకు తావులేదు. జగన్ సర్కార్‌పై కేంద్రహోంశాఖకు ఐదు పేజీల లేఖ, బీజేపీ నేతలతో హైదరాబాద్‌లో ఒక హోటల్లో సమావేశం కావడం తదితర అంశాలు…తన విశ్వసనీయతను తానే చంపుకున్నాడు. అయితే ఇవన్నీ నైతికపరమైన అంశాలు. కానీ చట్టపరంగా ఇవి న్యాయస్థానాల్లో నిలబడవు.
నిమ్మగడ్డ అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణులను న్యాయవ్యవస్థల ద్వారానే కట్టడి చేయాలి. అంతే తప్ప, న్యాయాన్ని, చట్టాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. నిమ్మగడ్డ కంటే జగన్ సర్కార్ ఎక్కువ తప్పులు చేయడం వల్ల…నిమ్మగడ్డ తప్పులు పక్కకు పోయాయి. ఇదే జగన్ సర్కార్ చేసిన పెద్ద తప్పు.
నచ్చని వ్యక్తి తప్పులు చేస్తున్నాడని గ్రహిస్తే…అతను మరిన్ని తప్పులు చేసేలా మౌనం పాటించాలి. అదే రాజకీయ వ్యూహం. కానీ జగన్ సర్కార్‌కు లేడికి లేచిందే పరుగు అన్నట్టు…మనసులో ఆలోచనమే కలగడమే ఆలస్యం…తక్షణం అమలు కావాల్సిందే. న్యాయం, రాజ్యాంగం లాంటి వాటితో పనిలేదని జగన్ సర్కార్ తరచూ భావిస్తూ బొక్క బోర్లా పడుతూ ఉంటుంది.
నిమ్మగడ్డ తొలగింపు, తిరిగి పునర్నియామకం మధ్య జరిగిన వ్యవహారాలతో…అనవసరంగా అతనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పొలిటికల్ సెలబ్రిటీని చేశారు. నిమ్మగడ్డకు మరో 8 నెలల పదవీ కాలం ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ మాత్రం సంబరానికి జగన్ సర్కార్ న్యాయ వ్యవస్థలను గౌరవించరనే అప్రతిష్టను మూట కట్టుకోవాల్సి వచ్చింది. పోనీ చివరికి ఏమైనా సాధించారా? అని ప్రశ్నించుకుంటే ఏమీ లేదనే జవాబు వస్తుంది.
అయినా జగన్ సర్కార్‌కు న్యాయస్థానాల్లో మొట్టికాయలు తినడం, మాట పడడం నిత్యకృత్యమైంది. అలాంటి వాటికి ఫీల్ అయ్యే సున్నితత్వం కూడా ఈ సర్కార్‌లో పోయినట్టుంది. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే…ఇలాంటి దుందుడుకు చర్యలకు దిగేవాళ్లు కాదేమో!