మై హోమ్ నుంచి ఏటిటి?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైకూన్ మై హోమ్ సంస్థ టీవీ 9 టేకోవర్ చేసి మీడియాలోకి అడుగుపెట్టింది. ఆహా ఓటిటి ని స్టార్ట్ చేసి ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మూవీ…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టైకూన్ మై హోమ్ సంస్థ టీవీ 9 టేకోవర్ చేసి మీడియాలోకి అడుగుపెట్టింది. ఆహా ఓటిటి ని స్టార్ట్ చేసి ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మూవీ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్ ను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రేయా మీడియా ఎటిటి అని, యుప్ టీవీ మినీ థియేటర్ అని తీసుకువచ్చిన కాన్సెప్ట్ నే మరి కాస్త విస్తరించి, మరి కాస్త కొత్తగా ఆలోచించి, అమలు చేసే ఆలోచనను మై హోమ్ సంస్థ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 

ఆహా కోసం గీతా సంస్థతో కలిసినట్లే, ఈ అప్ డేట్ వెర్షన్ ఆప్ ఏటిటి కోసం బన్నీవాస్ తో చేయి కలుపుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు ఇప్పుడు డిజిటల్, శాటిలైట్, ఇలా రకరకాల రైట్స్ వున్నాయి. హోమ్ థియేటర్ రైట్స్ అనేది లేదు. ఈ తరహా ఆలోచనకు శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది. 

అంటే క్యూబ్ లాంటి కనెక్షన్ లేకుండానే ఎవరి ఇంట్లో వారు పే చేసి సినిమా చూడొచ్చు. పెద్ద సినిమాలు అయిదు వందలు, వెయ్యి రూపాయలు పే చేసి హాయిగా ఇంట్లోంచే చూసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లకుండా ఇంటిల్లిపాదీ ఇంట్లోనే కూర్చుని వెయ్యి రూపాయలు ఇచ్చి చూడడం అన్నది పెద్దగా ఎక్స్ పెన్సివ్ అని ఫీల్ కాకపోవచ్చు. 

అయితే ఇదంతా బ్రాడ్ ఐడియా అని, ముందుగా చిన్న, మీడియం సినిమాలను తీసుకుని, ప్రమోట్ చేసి, ఆన్ లైన్ లో విడుదల చేయడం ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తం మీద కరోనా వచ్చి సినిమా పంపిణీ వ్యవస్థ స్వరూపాన్ని మార్చేస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు కూడా ఇలా ఆన్ లైన్ పంపిణీ వ్యవస్థ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే థియేటర్ల వ్యవస్థ మీద గీతా, సురేష్, దిల్ రాజు కాస్త అదుపు కలిగి వున్నారు. ఇప్పుడు అదే అదుపును ఆన్ లైన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద కూడా తెచ్చుకోవాలని ముందు చూపుతో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది