ఇది ఇప్పటి సంగతి కాదు. పాత కథే. పవన్ కల్యాణ్ సినిమాలకు రచయితల పడ్డ చాలా శ్రమ త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్లిపోతూ ఉండే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సగం సగం సమాచారం, మీడియాలో హడావుడి, అభిమానులను ఉత్సాహపరచడానికో.. ఇలాంటి రకరకాల కారణాలతో.. త్రివిక్రమ్ పేరు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది.
ఇది త్రివిక్రమ్ కూడా కావాలని కోరుకునేది కాకపోవచ్చు. కానీ మర్రిచెట్టు కింద ఏ చెట్టూ ఎదగదన్నట్టుగా .. త్రివిక్రమ్ చుట్టుపక్కల ఉండే సినిమాల విషయంలో రచయితలకు ఈ ఇబ్బంది తప్పదు. అప్పుడెప్పుడో వచ్చిన 'గోపాలా గోపాలా' సినిమా కు మాటల రచయిత హోల్ అండ్ సోల్ గా బుర్రా సాయి మాధవ్. అయితే ఆఫ్ ద రికార్డుగా ఒక లీక్ వదిలారు.
పవన్ కల్యాణ్ పాత్రకు త్రివిక్రమ్ ప్రత్యేక మాట సాయం చేశాడంటూ ఒక ప్రచారం మొదలైంది. అప్పటికి సాయి మాధవ్ ఇంకా స్టార్ రైటర్ కాలేదు. అప్పుడప్పుడే పేరొస్తోంది. ఆ దశలో సాయి మాధవ్ మాటలు రాసిన సినిమాకు త్రివిక్రమ్ పేరు ప్రచారంలోకి వస్తే.. ఆ రచయిత పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు! అప్ కమింగ్ రైటర్స్ విలవిల్లాడిపోయే పరిస్థితి అది.
త్రివిక్రమ్ కోరుకోకుండానే అలాంటి ప్రచారాలు జరుగుతూ ఉండవచ్చు. లేదా త్రివిక్రమ్ ను అలరించడానికి కొంతమంది అలాంటి ప్రచారాలకు తెగిస్తూ ఉండవచ్చు. అయితే.. ఈ ప్రచారాల వల్ల కొంతమంది రెక్కల కష్టానికి చేటు వస్తూ ఉంటుంది.
విశేషం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ అదే ప్రచారాలే జరుగుతున్నాయి! ఒకటని కాదు… అన్ని సినిమాల విషయంలోనూ త్రివిక్రమ్ పేరే! అసలు ఆ సినిమాలు రీమేక్ చేయాలనే ఆలోచనే త్రివిక్రమ్ దట! రీమేక్ చేయడమే అనుకరించడం, ఆ మాత్రం ఐడియా అధిపతి కూడా త్రివిక్రమ్.. అంటూ ప్రచారం సాగుతూ ఉండటం మరీ విడ్డూరం!
మరి రీమేక్ ఆలోచన క్రెడిట్ నే త్రివిక్రమ్ కు ఆపాదిస్తూ ప్రచారం చేస్తూ ఉన్న జనాలు.. ఆ సినిమాలు హిట్ అయితే.. వేరే వాళ్లకు క్రెడిట్ ను ఇవ్వనిస్తారా? ఒకవేళ అవి పోతే.. రీమేక్ చేయకూడని సినిమాలను టచ్ చేశారంటూ త్రివిక్రమ్ ఐడియా తప్పని అనగలరా!