గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరు ఇటీవల కాలంలో తరచూ వార్తలకెక్కుతోంది. ఇందుకు కారణం ఆయన ఇద్దరు కూతుళ్లే అని చెప్పక తప్పదు. తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాల వెన్నులో వణుకు పుట్టించిన స్మగ్లర్ వీరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విద్యారాణి, రెండో కుమార్తె విజయలక్ష్మి.
2004లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని గురించి అందరూ మరిచి పోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తెల వల్ల మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణిని బీజేపీ అక్కున చేర్చుకుంది. దేశ వ్యాప్తంగా పేరుగాంచిన స్మగ్లర్ కుమార్తె కావడంతో సహజంగానే విద్యారాణి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
తాజాగా విద్యారాణి చెల్లెలు విజయలక్ష్మి కూడా తెరపైకి వచ్చారు. విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. అయితే పెద్దగా గుర్తింపు ఉన్న పార్టీ కాకపోవడంతో విజయలక్ష్మిని రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడామె ఓ హీరోయిన్‌గా తమిళ వెండితెరకు పరిచయం కానున్నారు.
మావీరన్ పిళ్లై అనే సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు ఈ సినిమాను కేఎన్‌ఆర్ రాజా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన నేపథ్యంలో స్మగ్లర్ కుమార్తె అయిన విజయలక్ష్మి పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది.
తండ్రి స్టైల్లో తుపాకీని భుజాన వేసుకుని నిలబడ్డ లుక్ అదిరిపోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా కథా వస్తువు ఏంటనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. ఏది ఏమైనా స్మగ్లర్ కూతురనే కారణంతో సమాజం నుంచి వెలి వేయకుండా చిత్రపరిశ్రమ ఆదరించడం ప్రశంసనీయమని చెప్పొచ్చు.