మరో కీలక అంశంపై తెలంగాణలో మీడియా మేనేజ్ మెంట్ షురూ అయింది. అదే ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేది మీడియా ద్వారానే. ఇప్పుడిదే మీడియాను మభ్యపెట్టే కార్యక్రమం తెలంగాణలో జోరుగా సాగుతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కథనాలు, వార్తలు మాత్రమే ఓ సెక్షన్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అదే సెక్షన్ మీడియాకు చెందిన పత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి. అంతే తప్ప వాస్తవాలు మాత్రం వెలుగులోకి రావడంలేదు.
సమ్మె మూడోరోజుకు చేరుకుంది. ఎక్కడికక్కడ ఉద్యోగులు సమ్మెను తీవ్రతరం చేశారు. మానవ వలయాలుగా ఏర్పడ్డారు. బస్సుల్ని కదలకుండా ఆపేశారు. కొందరు బస్సులకు అడ్డంపడ్డారు కూడా. కానీ ఇలాంటివి చాలా తక్కువగా మీడియాలో కనిపించాయి. తెలంగాణ అంతటా సోమవారం బస్సులు భారీఎత్తున తిరిగినట్టు మాత్రమే ఓ సెక్షన్ టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికల్లో కనిపించింది. కానీ నిజం ఏంటనేది సోషల్ మీడియాను ఫాలో అయిన వాళ్లకు ఈజీగానే అర్థమైంది.
దసరా సీజన్ లో ఓవైపు బస్సుల్లేక ప్రయాణికులు నానా ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు డిపోల్లో బస్సులు ఖాళీగా ఉన్నానని.. పండగను సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రయాణికులంతా ఆదివారం నాటికే తమ సొంత ఊళ్లకు చేరుకున్నారంటూ ఆర్టీసీ ప్రకటించడం హాస్యాస్పదం. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పల్లెలకు వెళ్లడానికి ప్రయాణికులు ఎంత ఇబ్బందిపడ్డారో సోషల్ మీడియా చూస్తే అర్థమౌతుంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు పూర్తిగా బస్సు సర్వీసులు రద్దయ్యాయి. వీళ్లంతా ప్రైవేట్ సర్వీసుల్నే నమ్ముకోవాల్సి వచ్చింది.
మరోవైపు చార్జీలపై కూడా ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి ఇస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేటు బస్సులు దండిగా తిరుగుతున్నాయని, వాళ్లంతా తాము చెప్పిన చార్జీల్నే వసూలు చేస్తున్నాయని ప్రకటించుకున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఒక్కో ప్రయాణికుడి నుంచి టిక్కెట్ రేటు కంటే 3 రెట్లు అదనంగా ముక్కుపిండి వసూలు చేసిన ఘటనలు దాదాపు ప్రతి ప్రాంతంలో జరిగాయి. అదనంగా చెల్లించకపోతే బస్సు దిగమని చెబుతున్నారు.
దీంతో గత్యంతరం లేక టిక్కెట్ ధరకు 3 రెట్లు ఎక్కువగా చెల్లించి ప్రయాణించారు చాలామంది. ఓవైపు అదనంగా డబ్బులు చెల్లించవద్దంటూ పోలీసులు, అధికారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఈ బాదుడు తగ్గలేదు. ఇదేదీ ఓ సెక్షన్ మీడియాలో రాలేదు. ఇవన్నీ ఒకెత్తయితే.. కార్మికుల ఆందోళన కవరేజీ మరో ఎత్తు. ఉద్యోగులు చేపట్టిన మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు, ప్రతిపక్షాల మద్దతు లాంటి అంశాలకు మీడియా పెద్దగా ప్రధాన్యం ఇవ్వలేదు. ఈ స్థానంలో “ఆర్టీసీ ఆధునికీకరణ”కు కేసీఆర్ చేపట్టబోయే ప్రణాళికకు మాత్రం భారీ ఎత్తున కవరేజీ దక్కింది.
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని, 30శాతం బస్సుల్ని అద్దె లెక్కన, మరో 20శాతం బస్సుల్ని ప్రైవేట్ కింద నడుపుతామంటూ కేసీఆర్ చేసిన ప్రకటనకు భారీగా ఆదరణ దక్కింది. సబ్సిడీలు యథాతథంగా కొనసాగుతాయని, 50శాతం ప్రభుత్వ బస్సులే ఉంటాయంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను హెడ్ లైన్స్ గా పెట్టింది ఓ సెక్షన్ మీడియా. అదే సమయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని, ఉద్యోగులు చేసిన సమ్మెను చాకచక్యంగా పక్కనపెట్టింది.
తెలంగాణలో మీడియాను మేనేజ్ చేసే వ్యవహారం కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతూనే ఉంది. ఏ వార్తల్ని హైలెట్ చేయాలి, వేటిని తొక్కిపెట్టాలనే అంశాలపై ఓ సెక్షన్ మీడియా పూర్తి క్లారిటీతో వ్యవహరిస్తోంది. అంతెందుకు, మొన్నటికిమొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణలో ఓ వర్గం మీడియా వ్యవహరించిన తీరును ప్రజలంతా చూశారు. ఇప్పుడు అదే బాటలో ఆర్టీసీ సమ్మె కవరేజ్ కూడా సాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా సాగుతుంటే.. తప్పులు ఎత్తిచూపాల్సిన మీడియా తన పని మరిచి తానాతందానా అంటోంది.