ఏ జాతీయ పార్టీ అండ చూసుకుని తాను సేఫ్ అనుకున్నారో.. అదే జాతీయ పార్టీ ఇప్పుడు ఈటల కొంప ముంచేలా ఉంది. లఖింపూర్ ఘటన మరచిపోకముందే హర్యానాలో ఓ బీజేపీ ఎంపీ కారు రైతుల పైకి దూసుకెళ్లడంతో మరో వివాదం మొదలైంది. దేశంలో రైతాంగం మొత్తం.. బీజేపీని విలన్ గా చూస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని తమ గెలుపుకి అవకాశంగా మలచుకుంటోంది. రైతు బంధు ఇచ్చేవారు కావాలా, రైతుల ప్రాణాలు తీసే పార్టీకి ఓట్లు వేస్తారా అంటూ ప్రచారంలో ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీని నమ్ముకుని ఈటల బద్నాం అయినట్టే లెక్క.
లఖింపూర్ దుర్ఘటన ఉత్తర ప్రదేశ్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనే అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో లఖింపూర్ ఘటన బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. అయితే అంతకంటే పెద్ద దెబ్బ ఈటలపై పడేలా ఉంది. అవును, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లఖింపూర్ మారణకాండను టీఆర్ఎస్ బాగా హైలెట్ చేస్తోంది. ఈటల ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఆ పార్టీ పాప పుణ్యాలన్నీ ఆయన ఖాతాలోనే పడుతున్నాయి.
హుజూరాబాద్ లో ఈటల తన సొంత బలంతోనే పోటీలో ఉన్నా.. ఆయన ప్రస్తుతం బీజేపీ అనే చెట్టునీడలో ఉన్న మనిషి. నిన్న మొన్నటి వరకూ కమలం గుర్తు ఈటలకు అదనపు బలం అనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే సరికి ఈటలకు అది మరింత అనుకూలం అనే భావన కూడా ఏర్పడింది. కానీ ఉన్నట్టుండి రెండ్రోజుల్లో పరిణామాలు మారిపోయాయి.
లఖింపూర్ దుర్ఘటనతో బీజేపీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో ఈటలపై కూడా ఆ ప్రభావం పడేట్టు కనిపిస్తోంది. దీనికితోడు హర్యానాలో జరిగిన మరో ఘటన బీజేపీపై మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది.
బద్వేల్ లో ఎలాగూ బీజేపీకి అంత సీన్ లేదు. కనీసం ఆ పార్టీ గురించి కానీ, అభ్యర్థి గురించి కానీ మాట్లాడుకునే సందర్భం లేదు. అయితే హుజూరాబాద్ లో పరిస్థితి వేరు. టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ కొన్నాళ్లపాటు సొంత పార్టీ పెట్టేందుకు ఉబలాటపడ్డారు. అది కుదరదని డిసైడ్ అయిన తర్వాత ఇండిపెండెంట్ గా అయినా పోటీలో నిలబడాలనుకున్నారు. కానీ టీఆర్ఎస్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండటం, పోలీసు కేసులతో వేధిస్తుండటంతో జాతీయ పార్టీ అయిన బీజేపీ కండువా కప్పేసుకుని కమలం గూటిలో కూర్చున్నారు.
అప్పుడు ఆయన్ను కాపాడిన అదే కమలం పువ్వు, ఇప్పుడు ఆయన ఓటమికి పరోక్ష కారణంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కి కాస్త ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నా.. నిరుద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ల నామినేషన్లతో గందరగోళం నెలకొంది. దీంతో ఈటల సంబరపడుతున్న వేళ, లఖింపూర్ ఘటన ఆయన నెత్తిన కమలదళం భస్మాసుర హస్తంలా నిలిచింది.