రాజ‌ధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు: సోము

దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజ‌ధాని అంశాల‌పై ర‌క‌ర‌కాల నిర్ణ‌యాలు జ‌రుగుతుంటాయ‌ని, వాటి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోద‌ని అన్నారు ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజు. దేశంలో అనేక చోట్ల రాజ‌ధానుల…

దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజ‌ధాని అంశాల‌పై ర‌క‌ర‌కాల నిర్ణ‌యాలు జ‌రుగుతుంటాయ‌ని, వాటి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోద‌ని అన్నారు ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు సోము వీర్రాజు. దేశంలో అనేక చోట్ల రాజ‌ధానుల ఏర్పాట్లు చేస్తూ ఉంటార‌ని.. వాటి విష‌యంలో రాష్ట్రాల‌కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌ని ఏపీ బీజేపీ విభాగం అధ్య‌క్షుడు అన్నారు. చంద్ర‌బాబు నాయుడి హ‌యాంలో సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధాని అంటూ హంగామా చేశార‌ని, అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేద‌ని సోము అన్నారు. ఇప్పుడు కూడా మూడు రాజ‌ధానుల అంశంలో కేంద్రం అదే వైఖ‌రిని అనుస‌రిస్తుంద‌ని ఈ బీజేపీ నేత వ్యాఖ్యానించారు.

ఏపీలో మూడు రాజ‌ధానుల అంశంపై ప‌ట్ల కొంత‌మంది బీజేపీలోని వారు ఇన్నాళ్లూ ఆక్షేప‌ణ‌లు తెలిపారు. ఏపీ బీజేపీ విభాగం మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ కూడా మూడు రాజ‌ధానుల అంశానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలోకి కొత్త‌గా చేరిన  సుజ‌నా చౌద‌రి, కేంద్రం జోక్యం చేసుకుంటుంద‌ని అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ విభాగానికి కొత్త‌గా అధ్య‌క్షుడిగా నియ‌మిత‌మైన సోము వ్యాఖ్య‌లు ఆస‌క్తిదాయ‌కంగా మారాయి.

చంద్ర‌బాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే పేరున్న బీజేపీ నేత‌లు మూడు రాజ‌ధానుల అంశానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. వారికి బీజేపీలో ఇప్పుడు చెక్ ప‌డింది. కొత్త అధ్య‌క్షుడి నియామ‌కం అనంత‌రం వారికి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో సోము వీర్రాజు రాజ‌ధాని అంశం మీద కూడా వ్యాఖ్యానించారు. కేంద్రం జోక్యం చేసుకోద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రులైన బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కూ చెక్ ప‌డిన‌ట్టే చెప్పే మాటే.

ఇక చంద్ర‌బాబుపై సోము వీర్రాజు స్పందిస్తూ, బీజేపీ త‌న‌కు స‌న్నిహితం అయిపోయిన‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నార‌ని, అదంతా చంద్ర‌బాబు నాయుడి రాజ‌కీయం అని అన్నారు. బీజేపీ, జ‌న‌సేన‌ల‌కు ఉమ్మ‌డిగా ఏపీలో 20 శాతం వ‌ర‌కూ ఓటింగ్ ఉంద‌నే అంచ‌నాల‌ను వ్య‌క్తం చేశారు సోము.

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది