టైటిల్: గుర్తుందా శీతాకాలం
రేటింగ్: 2/5
తారాగణం: సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసిని, ప్రియదర్శి, హర్షిణి
కెమెరా: సత్య హెగ్డె
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: కాలభైరవ
నిర్మాత: భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి
దర్శకత్వం: నాగశేఖర్
విడుదల తేదీ: 9 డిసెంబర్ 2022
2020లో వచ్చిన కన్నడ సినిమా “లవ్ మాక్టెయిల్” కి రీమేక్ ఈ “గుర్తుందా శీతాకాలం”. రెండేళ్ల క్రితం మొదలై ఇప్పటికి సరిగ్గా శీతాకాలంలో వచ్చింది.
ఈ సినిమాకి ప్రేక్షకులు ఎందుకొస్తారని అడిగితే చెప్పే సమాధానం ఒక్కటే- “తమన్నా ఉంది కాబట్టి”. మరి తమన్నా ఈ సినిమాని ఎందుకు ఒప్పుకుంది అంటే జవాబు చెప్పడం కష్టం. పెద్దగా లోతున్న పాత్ర కాదు. గుర్తుండిపోయే అంత కొత్తదనమూ లేదు. బహుశా కన్నడలో పెద్ద హిట్ కాబట్టి అదే తెలుగులో రిపీటవుతుందనుకుని తీసుండాలి. అంతకు మించి వేరే ఏ కారణమూ కనపడదు.
కథగా తీసుకుంటే ఇది “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” పంథాలో సాగుతుంది. అలాగని ఆ సినిమా స్థాయి ఎమోషన్స్ ఇందులో ఉంటాయనుకుంటే పొరపాటే. తన ప్రయాణంలో కనపడ్డ ఒకమ్మాయికి కారులో లిఫ్టిచ్చి తన గతం చెబుతుంటాడు హీరో. ఆ గతంలో ఇద్దరమ్మాయిలతో ముడిపడిన తన కథ చెబుతాడు. సింపుల్గా ఇదే మొత్తం సినిమా.
ఇలాంటి సినిమాలు ఆకట్టుకోవాలంటే ముందుగా మ్యూజికల్ గా మేజికల్ అయ్యుండాలి. ఆ తర్వాత పాత్రల మధ్యలో రసాత్మకమైన కెమిస్ట్రీ పండాలి. మరీ బరువెక్కకుండా కాపాడే సున్నితమైన ఫన్ మొమెంట్స్ ఉండాలి. ఇవేవీ ఈ సినిమాలో లేకుండా చూసుకున్నారు మేకర్స్.
సత్యదేవ్ నటనని పక్కన పెడితే కథ నడిచే విధానం కానీ, తిరిగే మలుపులు కానీ, పాత్ర స్వభావాలు కానీ ఏవీ పెద్దగా ఆకట్టుకోవు. రొటీన్ ఊకదంపుడు ఎమోషన్స్ ని పెట్టి దాన్నొక పొయెటిక్ నెరేషన్ అనుకోమంటే కష్టమే.
ప్రధమార్థంలో అంత మెచ్యూర్ గా బిహేవ్ చేసిన తమన్నా పాత్ర సెకండాఫులో అంత ఇన్సెక్యూర్ గా ఎందుకు మారుతుందో తెలీదు.
సత్యదేవ్ నటన మాత్రం బాగుంది. చాలా ఈజ్ తో చేసాడు. చివరిదాకా ప్రేక్షకులు హాల్లో కూర్చోగలిగరాంటే దానికి కారణం ఇతనే. నాని టైపులో కావాల్సినంత యాక్టివ్ నెస్ తో సహజసిద్ధమైన నటన కనబరిచాడు. అయితే అక్కడక్కడ రొటీన్ ఫైట్స్ చిరాకు తెప్పిస్తాయి.
తమన్నా తెర మీద తెల్లగా మెరవడానికి, ప్రధామార్థంలో కాస్త అర్థవంతంగా బిహేవ్ చేయడానికి తోడ్పడింది. నిజానికి ఆమె పాత్రతో చివరి వరకు ప్రేక్షకుల్ని ఒక ఎమోషనల్ జర్నీ చేయించగలిగే స్కోప్ ఉన్నా కూడా సెకండ్ హాఫులో కంగాళీ చేసేసి డ్రాప్ చేసేసాడు దర్శకుడు.
అమ్ము పాత్రలో కనిపించిన కావ్యా శెట్టి కాసేపొకలాగ, ఇంకాసేపు ఇంకోలాగ బిహేవ్ చేస్తూ అసలా పాత్ర తీరూ తెన్నూ ఏవిటో అర్థం కాకుండా ఉంది. అలా తీరూ తెన్నూ లేకపోవడమే ఆమె పాత్ర అని అనుకోవాలంతే. కానీ అదే ట్రాక్ మళ్లీ మళ్లీ రిపీటవడం వల్ల విసుగు తెప్పిస్తుంది.
మేఘా ఆకాష్ అతిధి పాత్రకి ఎక్కువ పూర్తి పాత్రకి తక్కువ అన్నట్టుంది.
ప్రియదర్శి, హర్షిణి జంట సీన్స్ ముందుకు నడవడానికి ప్యాడింగ్ ఆర్టిస్టుల్లా పనిచేసారు. సుహాసినిది అతిధి పాత్రే.
ఈ కథలో ఒకటి రెండు చోట్ల ఒరిజినల్ సంభాషణలు పర్లేదనిపించినా ఎక్కడా మెరుపులైతే లేవు. డబ్బింగ్ సినిమా రాస్తున్నప్పుడు ఇంకాస్త ఒరిజినాలిటీ చూపించి హిలారియస్ గా రాసుండాల్సింది. అప్పుడు ప్రేక్షకులకి కాస్త బరువు తగ్గుండేది.
పాటలు కూడా గుర్తుండేలా లేవు. సోను నిగం, అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ వంటి సింగర్స్ పాడినా పెద్దగా పని జరగలేదు. కాలభైరవ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి ఇలాంటి సినిమాల్లో గీతాంజలిలో గుండెలు పిండిన ఇళయరాజా సంగీతానికున్నంత స్కోప్ ఉంది. సంగీత దర్శకుడు ఆ అవకాశాన్ని పెద్దగా వాడుకోలేదు.
ఇక కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మాత్రం బాగానే పని చేసాయి. రెండు గంటల ఇరవై నిమిషాల్లో కథని కంచికి పంపి, ప్రేక్షకుల్ని ఇంటికి పంపడం బాగుంది.
ఏ విభాగం చూసుకున్నా గుర్తుంచుకోదగ్గ అంశాలేవీ లేవిందులో. ఈ జానర్ చిత్రాలు మెచ్చేవారు కూడా పెద్దగా మెచ్చుకోలేని విధంగా మిగిలింది. ఒక భాషలో విజయవంతమయిందని, పేరున్న హీరోయిన్ ని ఒప్పించి యథాతథంగా తీసేయడం వల్ల ఫలితం రిపీట్ కాదనడానికి ఉదాహరణగా నిలిచే చిత్రం ఈ “గుర్తుందా శీతాకాలం”.
బాటం లైన్: గుర్తుండదు