వైసీపీ ఒక రాజకీయ పార్టీగా తన ఆలోచనలను ఈ మధ్య వ్యక్తం చేసింది. ఆ పార్టీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కొంత సంచలనం రేపే కామెంట్స్ చేశారు. విడిపోయిన ఆంధ్రా- తెలంగాణా రెండూ కలిస్తే తప్పేంటి అని ఆయన ఒక ప్రశ్నను జనంలోకి వదిలారు.
అది సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే ఉమ్మడి ఏపీ సమైక్య ఆంధ్రాను ఎపుడూ తమ పార్టీ కోరుకుంటుంది అని పార్టీ విధానాన్ని స్ట్రాంగ్ గా చెప్పారు. తమ పార్టీ ఒక్కటే సమైక్య నినాదాన్ని అప్పట్లో బలంగా చాటిందని, నాటి నుంచి నేటి దాకా అదే నినాదం తమ విధానం అని ఆయన స్పష్టం చేశారు.
దీని మీద తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీ ఆలోచనలకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఏపీ తెలంగాణా రెండూ కలిస్తే తప్పేంటి అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అది మంచిదే కదా అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర విభజన అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని ఆయన పేర్కొంటూ అక్కడ ఏమి తీర్పు వస్తుందో అన్న ఆసక్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. జేడీ అన్నారని కాదు కానీ ఈ తొమ్మిదేళ్ళలో అడ్డగోలు విభజన జరిగి ఏపీ దారుణంగా నష్టపోయిందని అందరి బాధగా ఉంది. విభజన జరిగిన తీరు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద సుప్రీం కోర్టులో విచారణ ఎలా జరుగుతుందో, కేంద్రం కౌటర్ దాఖలు చేస్తుందో లేదో చూడాలి.