దాదాపు దశాబ్దం కిందట స్థాపించబడిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదాను సంపాదించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం, సీట్లను పొందడం ద్వారా జాతీయ పార్టీగా అవతరించింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం, ఓట్ల శాతం సాధనతో ఆప్ జాతీయ పార్టీగా మారింది.
ఇప్పటి వరకూ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని సాధించింది. హర్యానా, హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే పోరాడింది. గత పర్యాయం హర్యానాలో ఆప్ సాధించింది పెద్దగా ఏమీ లేదు. అయితే ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆప్ అక్కడ రెండో స్థానంలో నిలిచింది. 2024 ఎన్నికల్లో హర్యానాపై ఆప్ చాలా ఆశలే పెట్టుకుంది. ఇక హిమాచల్ లో తాజా ఫలితాల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. కానీ గుజరాత్ అసెంబ్లీలోకి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 13 శాతం ఓట్లను పొంది ఆప్. ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు.
గుజరాత్ ను స్వీప్ చేస్తామంటూ ఆప్ ప్రచారాన్ని హోరెత్తించింది. అలాంటిదేమీ జరగలేదు కానీ, కాంగ్రెస్ ను మాత్రం బాగా దెబ్బతీసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ కు పడ్డ ఓట్లన్నీ కాంగ్రెస్ నుంచి చీల్చుకున్నవే అని స్పష్టం అవుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ చాలా యేళ్లుగా అధికారాన్ని దూరంగానే ఉంటున్నా… స్థిరమైన ఓటు బ్యాంకును, మెరుగైన స్థాయిలో సీట్లను మాత్రం సాధిస్తూ వచ్చింది.
క్రితం సారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ దాదాపు 40 శాతం ఓట్లను, 77 అసెంబ్లీ సీట్లను గెలిచింది. అయితే ఈ సారి కాంగ్రెస్ కు 27 శాతం ఓట్లే దక్కాయి. సరిగ్గా కాంగ్రెస్ కోల్పోయిన స్థాయి ఓట్లను ఆప్ సంపాదించింది. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఓట్లను కూడా ఆప్ భారీగా చీల్చింది. చాలా సీట్లలో ఆప్ రెండో స్థానాన్ని కూడా సంపాదించింది. కాంగ్రెస్ చిత్తయిపోవడానికి ఆప్ తన వంతు పాత్రనంతా పోషించింది.
ఏతావాతా ఆప్ కు గుజరాత్ లో అధికారం అందలేదు. కానీ ఒక్కో రాష్ట్రం వారీగా రాణింపుతో ఆప్ జాతీయ పార్టీ గుర్తింపును మాత్రం సంపాదించుకుంది. ఇది ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే.