జనసేనాని పవన్‌కల్యాణ్ తీవ్ర నిరాశ, నిస్పృహలను వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల విమర్శలకు దీటైన కౌంటర్లు ఇవ్వకుండా, చేతులెత్తేయడం ఆయనకే చెల్లింది. పవన్ ట్విటర్ ఖాతా ఓపెన్ చేయగానే… ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. JaiHind! అనే స్ఫూర్తిదాయక నినాదం కనిపిస్తుంది. కానీ ఆయనలో మాత్రం ఆ తెగువ మచ్చుకైనా కనిపించదు. బహుశా ఆయన ఇతరులకు మాత్రమే చెబుతున్నట్టున్నారు.
త్వరలో పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రచార రథం కూడా సిద్ధమైంది. ఈ వాహనాన్ని ట్విటర్ వేదికగా ఆయన ప్రదర్శించారు. ఈ రథానికి “వారాహి” అని మంచి పేరు కూడా ఖరారు చేశారు. పవన్ ప్రచార వాహనంపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ఏమన్నారంటే… వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారన్నారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయరని హెచ్చరించారు.
లక్షల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే పవన్ ఇండియన్ మోటార్ వెహికల్ చట్టాన్ని చదివి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని దెప్పి పొడిచారు. పవన్ ప్రచార వాహనానికి తెలుపు, నలుపు మరో ఇతర రంగు కాకుండా పసుపు రంగు వేసుకుంటే సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. పసుపు రంగు ఏ పార్టీదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పేర్ని నాని విమర్శలపై తాజాగా పవన్ ట్విటర్లో స్పందించారు.. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా షర్ట్‌ను షేర్ చేశారు. ముందుగా తన సినిమాలను అడ్డకున్నారని … ఆ తర్వాత విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా తనను విశాఖ నగరం నుంచి పంపారని గుర్తు చేశారు. మంగళగిరిలో కారులో వెళ్తుంటే తనను అడ్డుకున్నారని పేర్కొన్నారు.
ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఆపేశారని విమర్శించారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారని ఆగ్రహించారు. శ్వాస తీసుకోవడం కూడా మానేయమంటారా? అని తన నిస్సహాయతను పవన్ వ్యక్తం చేయడం గమనార్హం. పవన్ ట్విటర్ వాల్‌పై కనిపించే… ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో అనే వాటిని పవన్ ఎప్పుడు ప్రయోగిస్తారో చూడాలి.