దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల వేస్తున్నారు. వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ వేర్వేరని ఆయన భావిస్తున్నారు. వైఎస్ గురించి మంచిగా మాట్లాడితే, పెద్ద సంఖ్యలో ఉన్న ఆయన అభిమానుల్ని తన వైపు తిప్పుకోవచ్చని గత కొంత కాలంగా చంద్రబాబు వ్మూహాత్మకంగా నడుచుకుంటున్నారు. జగన్‌ను విమర్శించినా రాజకీయ కోణంలో చూస్తూ ఎవరూ పెద్దగా పట్టించుకోరని బాబుకు తెలుసు. ఇదే వైఎస్సార్‌ను విమర్శిస్తే జనం జీర్ణించుకోలేరని వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించారు.
ఈ కారణంతోనే ఇటీవల కాలంలో వైఎస్సార్‌పై బాబు విమర్శలు తగ్గించారు. పైగా ఏ మాత్రం అవకాశం దొరికినా వైఎస్సార్ తనకు సన్నిహితుడని, అభివృద్ధిని కాంక్షించే నాయకుడిని కీర్తించడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. జగన్‌లా తాను ఆలోచించి వుంటే కడపకు వైఎస్సార్ పేరు తొలగించే వాన్నని తరచూ చెబుతున్నారు. కానీ తనకు అలాంటి సంస్కారం లేదన్నారు. వైఎస్సార్ అంటే తనకు గౌరవం వుందని ఆయన చెబుతుండడం విశేషం.
తన బామ్మర్ది బాలయ్య నిర్వహించే టాక్ షోలో కూడా వైఎస్సార్ తనకు ఆత్మీయ మిత్రుడిగా బాబు చెప్పుకొచ్చారు. అలాగే మరో ఎపిసోడ్‌లో బాలయ్య కూడా దివంగత వైఎస్సార్‌ను గొప్ప నాయకుడిగా అభివర్ణించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవని అనుకోలేం. తాజాగా గుంటూరు పర్యటనలో చంద్రబాబు మరోసారి వైఎస్సార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్ గురించి ఏమన్నారో తెలుసుకుందాం.
“ఐటీ పరిశ్రమని హైదరాబాద్‌కి తీసుకొచ్చి నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి కొనసాగించారు. జగన్ మాదిరిగా ఆయన కూడా ఐటీ పరిశ్రమలు కూల్చి వేసి వుంటే ఏమయ్యేది. అందుకే కొన్ని సందర్భాల్లో వైఎస్‌ని నేను శభాష్ అని మెచ్చుకుంటున్నా” అని చంద్రబాబు వేలాది మంది టీడీపీ కార్యకర్తల సమక్షంలో పొగడ్తలతో ముంచెత్తారు.
వైఎస్సార్‌ను జగన్ నుంచి వేరు చేయడం ద్వారానే టీడీపీకి ప్రయోజనం అని భావించి… చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారనేందుకు ఈ మాటలు నిదర్శనం.