గుజరాత్ ఎన్నికల ఫలితంతో మోడీ హవా ఏమిటో మరోసారి నిరూపణ అయింది. గుజరాత్ లో బిజెపి సాధించిన విజయం నేపథ్యంలో.. హిమాచల్ ప్రదేశ్ లో ఆ పార్టీకి దక్కిన ఓటమి పెద్దగా లెక్కలోకి రావడం లేదు. గుజరాత్ ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన నేపథ్యంలో.. నరేంద్రమోడీ పట్ల ప్రజల్లో ఎలాంటి ఆదరణ వెల్లువెత్తుతున్నదో దేశంలోని అన్ని పార్టీలు కూడా గమనిస్తున్నాయి.
ఈ విజయం నేపథ్యంలో మోడీ పట్ల, బిజెపి పట్ల దేశంలోని ఇతర పార్టీలు తమ వైఖరులను మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ కరుణాపూరితమైన చూపు తనమీద పడితే చాలు.. ఆయన పాదాల వద్ద మరింతగా సాగిలపడిపోవడానికి చంద్రబాబునాయుడు తపించిపోతున్నట్లుగా తెలుస్తోంది.
ఒక రకంగా చూసినప్పుడు సీఎం జగన్ కూడా మోడీతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. రాజకీయాలకు అతీతమైన బంధం మాది అని విశాఖ వేదికగా జగన్ ప్రకటించారు కూడా. అయితే ఆయన ఎన్నడూ తన బంధం విషయంలో భిన్నరీతులుగా ప్రవర్తించలేదు. మొదటినుంచి మోడీ పట్ల ఒకే తీరుతో ఉన్నారు. చంద్రబాబునాయుడు అలకాదు. ఆయన బేసిగ్గా అవకాశవాది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం ఆషాఢభూతిగా ఆయనకు సమకాలీన రాజకీయాల్లో పెద్ద కీర్తి ఉంది.
ఈ నేపథ్యంలో, మోడీ పట్ల ఆయన వ్యవహార సరళిని గమనిస్తే.. గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా.. చంద్రబాబు చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అదే 2014 ఎన్నికల వేళ వచ్చేసరికి మోడీతో చెట్టపట్టాలు వేసుకుని తిరగడానికి చంద్రబాబు మోమాటపడలేదు. మోడీ హవా దేశంలో వెల్లువెత్తుతోందని గ్రహించిన చంద్రబాబు.. మోడీ హవా ఆసరాతో అధికారంలోకి రావడానికి కుయుక్తులు పన్నారు.
ఎటూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మాత్రమే ఎన్నికలను ఎదుర్కొనే వ్యక్తి గనుక.. మోడీతో తాను పొత్తు పెట్టుకున్నారు. పవన్ ను కూడా కలుపుకున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. మోడీతో తన బేరసారాలు అనుకున్నట్టుగా జరగకపోయేసరికి, తన పాచికలు ఆయన వద్ద పారకపోయేసరికి వారితో కటీఫ్ చెప్పి మళ్లీ ఆయన మీద నిప్పులు కురిపించారు. మోడీ వ్యక్తిగత, కుటుంబ జీవితం గురించి కూడా చంద్రబాబు ఎన్నెన్ని అసహ్యమైన మాటలు మాట్లాడాడో ప్రజలకు తెలుసు. ధర్మపోరాటం పేరుతో ఒక నాటకం నడిపించి.. కేంద్రం మీద ఎన్నేసి మాటలు అన్నారో అందరూ గమనించారు.
2019లో తాను దారుణంగా ఓడిపోయి.. మోడీ తిరుగులేని శక్తిగా మళ్లీ ప్రధాని అయ్యాక.. బిజెపి పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నారు. మోడీని పల్లెత్తు మాట అనకుండా ప్రత్యేక మాటే తేకుండా.. జాగ్రత్త పడుతున్నారు. తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను బిజెపితో పొత్తుల్లోకి వ్యూహాత్మకంగా పంపారు. ఇపుడు పవన్ ద్వారా నరుక్కువస్తూ బిజెపితో కలిసి 2014లోలాగా పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మోడీ అంటే మళ్లీ కొత్తగా అతి భక్తి, వినయవిధేయతలు ప్రదర్శిస్తున్నారు. సత్సంబంధాలు కోరుకుంటున్నారు.
తాజాగా గుజరాత్ ఎన్నికల ఫలితంతో..మోడీ అనుగ్రహం దొరికితే చాలు.. ఆయన ఎదుట మరింతగా సాగిలపడిపోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ మోడీ అంత అమాయకుడా? అవసరాన్ని బట్టి రకరకాలుగా రంగులుమార్చే ఊసరవెల్లి చంద్రబాబు దుర్బుద్ధులను గుర్తించకుండా ఉంటారా? అని ప్రజలు అనుకుంటున్నారు.