ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైకోగా మార్చారు. ఏడాదిన్నరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారం వస్తుందో, రాదోనన్న భయం, బెంగ తదితరాలన్నీ కలిసి బాబుకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయి. అందుకే ఏదేదో ఆయన మాట్లాడుతున్నారు. భయాన్ని నిర్భయంగా బయట పెట్టుకుంటున్నారు. ఈ దఫా టీడీపీని అధికారంలోకి తీసుకురాకపోతే… ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు.
ఈ ప్రకటన టీడీపీకి తీవ్ర నష్టం కలిగిస్తోందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో కనిపించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాని నుంచి బయట పడేందుకు మరో తప్పుడు ప్రకటన చేయాల్సి వచ్చింది. తనకు కాదు, రాష్ట్ర ప్రజలకే చివరి చాన్స్ అని కొత్త నినాదం అందుకున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి ఇవే చివరి ఎన్నికలని యూటర్న్ తీసుకున్నారు. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోలేం అని హెచ్చరించారు. ప్రజలంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒకే ఒక్క తప్పుడు స్టేట్మెంట్ నుంచి బయటికి రావడానికి ఎన్నెన్నో సర్కస్ ఫీట్లు వేయాల్సి వస్తోంది. చివరి ఎన్నికలనే స్టేట్మెంట్తో …బాబుకు ఏమైందనే అనుమానాలు, ప్రశ్నలు పౌర సమాజం నుంచి వెల్లువెత్తాయి. అడుగడుగునా టీడీపీని బలహీనపరుస్తున్న జగన్… చంద్రబాబు దృష్టిలో సైకో అయ్యారు. తనను సైకోగా మార్చాడనే ఆవేదన చంద్రబాబులో గూడుకట్టుకుంది. తనకు ఓట్లు వేయడానికి లాన్స్ చాన్స్ అని, అలాగే రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి చివరి అవకాశమని చంద్రబాబు అంటున్నారంటే… మతిస్థిమితం సరిగా వున్నవాళ్లెవరైనా మాట్లాడే మాటలేనా?
హైదరాబాద్‌ను తానే నిర్మించానని, ఐటీ పరిశ్రమకు ఆద్యుడిని కూడా తానే అంటున్నారంటే… మనసు ఉండాల్సిన విధంగా వుండలేదని అర్థం చేసుకోవచ్చు. తాజాగా జగన్ వైసీపీలో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. అసలే సచివాలయ వాలంటరీ వ్యవస్థతోనే చంద్రబాబు నానా ఇబ్బందులు పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వాళ్లు ఎలాంటి పాత్ర పోషిస్తారో అర్థం కాక సతమతం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీలో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం బాబుకు మరింత పిచ్చెక్కిస్తుంది. ‘సైకో పాలన వద్దు.. సైకిల్ పాలన కావాలి’ అని చంద్రబాబు నినదిస్తున్నారు.
ఒక పార్టీ అధినేతగా అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. పవన్‌లాంటి నాయకుడు తప్ప, మరే నాయకుడైనా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థిస్తారు. అయితే తనకు అవకాశం ఇవ్వకపోతే… అంటూ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది.
తన పాలనలో పక్కాగా సంక్షేమ పథకాలు అందితేనే ఆశీర్వదించాలని జగన్ కోరుతున్నారు. చేసిన మంచి ఏంటో చెప్పుకుని అధికారాన్ని ఇవ్వాలని అడగడం మానేసి, సెంటిమెంట్, భయాందోళన సృష్టించి ఓట్లు అడగడం సైకో లక్షణాలు కాక మరేంటి?